కొనసాగుతున్న ఎయిర్‌కోస్టా నిధుల వేట

విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రాంతీయ విమానయాన సంస్థ ఎయిర్‌కోస్టా సేవలు ఇప్పట్లో తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. గత నెల చివరి వారంలో సేవలను నిలిపివేసిన ఎయిర్‌కోస్టా మార్చి 15 తర్వాత సేవలను తిరిగి ప్రారంభిస్తామని పేర్కొంది. విమానాలను అద్దెకు ఇచ్చిన సంస్థతో కొన్ని ఆర్థిక పరమైన అంశాలను పరిష్కరించుకోవాల్సి ఉందని.. నిధుల సమీకరణకు మదుపర్లతో చురుగ్గా చర్చలు జరుపుతున్నామని పేర్కొంది. అయితే.. చర్చలు ఇంకా కొలిక్కి రాకపోవడంతోపాటు ప్రస్తుత పరిస్థితి ఎన్నాళ్లు కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. మదుపర్లతో చర్చలు కొనసాగిస్తున్నందున వచ్చే రెండు నెలలపాటు సేవలను తిరిగి ప్రారంభించే అవకాశాలు లేవని ఎయిర్‌కోస్టా ప్రతినిధి తెలిపారు. సీట్ల భర్తీ బాగానే ఉన్నప్పటికీ.. నిర్వహణ వ్యయాలు పెరగడం వంటి కారణాల వల్ల కంపెనీకి నిధుల కొరత ఏర్పడి ఉండవచ్చని.. విమానాలను అద్దెకు ఇచ్చిన కంపెనీ ఒత్తిడి మేరకు విమానాల కార్యకలాపాలను ఎయిర్‌కోస్టా నిలిపివేసి ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జీఈ కేపిటల్‌ ఏవియేషన్‌ సర్వీసెస్‌ నుంచి ఎంబ్రార్‌ విమానాలను అద్దెకు తీసుకుని ఎయిర్‌కోస్టా సేవలందిస్తోంది. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) వద్ద ఉన్న సమాచారం ప్రకారం గత ఆర్థిక సంవత్సరానికి (2015-16) రూ.327 కోట్ల ఆదాయంపై కంపెనీ రూ.130 కోట్ల నష్టాన్ని చవి చూసినట్లు తెలుస్తోంది. రెండు విమానాలతో హైదరాబాద్‌, తిరుపతి, చెన్నై సహా మొత్తం 8 నగరాలకు విమాన సేవలను అందిస్తున్న ఎయిర్‌కోస్టాకు గత ఏడాది అక్టోబరులో దేశ వ్యాప్తంగా సేవలందించడానికి డీజీసీఏ నుంచి లైసెన్సు లభించింది. ఇందుకు అనుగుణంగా దేశంలోని దిల్లీ, ముంబయి వంటి ప్రధాన నగరాలకు సేవలందించాలని భావిస్తోంది. 50 ఎంబ్రార్‌ విమానాలను సమకూర్చుకోవడానికి 2014లో దాదాపు 2.94 బిలియన్‌ డాలర్ల విలువైన ఆర్డరును కంపెనీ పెట్టింది. దీని ప్రకారం వచ్చే ఏడాది నుంచి కంపెనీ విమానాలను సమకూర్చుకోవాల్సి ఉంది. ఈనేపథ్యంలో నిధుల కొరత ఏర్పడడం గమనార్హం. జనవరి నుంచే కంపెనీ తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటోందని, ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితులు తలెత్తాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఎయిర్‌కోస్టాకు నిధుల కొరత ఏర్పడడం ఇది రెండో సారి. గత ఏడాది ఆగస్టులో కూడా విమాన సేవలను కంపెనీ నిలిపివేసింది. అయితే.. వెంటనే తిరిగి ప్రారంభించింది. 2013, అక్టోబరులో కార్యకలాపాలను ప్రారంభించి దక్షిణాదిలోనే తొలి ప్రాంతీయ విమానయాన సంస్థగా ఎయిర్‌కోస్టా గుర్తింపు పొందింది.

కారణాలు ఇవీ..: దేశీయ విమాన ప్రయాణికులు సగటున 20 శాతం చొప్పున పెరుగుతున్నారు. ఏడాది క్రితంతో పోలిస్తే జనవరిలో దేశీయ విమాన ప్రయాణికులు 25 శాతానికి పైగా పెరిగారు. ప్రయాణికులు పెరుగుతున్నప్పటికీ.. ధరల పోటీ, నిర్వహణ వ్యయాల కారణంగా ప్రాంతీయ విమానయాన సంస్థలు ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. పెద్ద విమానయాన సంస్థలకు అవసరమైనన్ని నిధులు సమకూర్చే పెట్టుబడిదారులు, ప్రమోటర్లు ఉంటారని.. మార్జిన్లపై ఒత్తిడి ఉన్నా అవి కొత్త కాలం తట్టుకోగలవని అభిప్రాయపడుతున్నారు. ప్రాంతీయ విమానయాన సంస్థల పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుందని.. దీంతో నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయని వివరించారు. ఎయిర్‌కోస్టా కంటే ముందే గత ఏడాది జులైలో బెంగళూరుకు చెందిన ప్రాంతీయ విమానయాన సంస్థ పెగాసస్‌ కార్యకలాపాలను నిలిపివేసింది. వివిధ నగరాల్లో భారీ ఇంధన పన్నులు, అధిక విమానాశ్రయ ఛార్జీలు వంటివి ప్రాంతీయ విమానయాన సంస్థలపై భారం మోపుతున్నాయి. కనీసం లాభనష్టాలు లేని (బ్రేక్‌ ఈవెన్‌) స్థాయికి చేరడానికి కూడా కష్టమవుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*