అనామకుని ఖాతాలో రూ.17 కోట్లు

హైదరాబాద్‌: ఒకే ఖాతా ద్వారా చెల్లింపులు నిర్వహిస్తూ పన్నులు ఎగ్గొడుతున్న వైనమిది. హైదరాబాద్‌ కేంద్రంగా జరుగుతున్న ఈ బాగోతంపై ఆదాయపన్నుశాఖ మరింత లోతుగా దర్యాప్తు జరపుతోంది. ఈ మేరకు ఆ శాఖ మంగళవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. గత ఏడాది నవంబరు 8న కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు ప్రకటించిన తర్వాత హైదరాబాద్‌ నాంపల్లిలోని ఒక బ్యాంకు ఖాతాలో రూ.17 కోట్లు జమ అవడాన్ని ఆదాయపన్ను అధికారులు గమనించారు. ఖాతాదారుడ్ని పిలిచి విచారిస్తే ఆ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధంలేదని, ఆ ఖాతా తన మిత్రుడు నిర్వహిస్తుంటాడని వెల్లడించాడు. అతను చెప్పిన వివరాల ప్రకారం డబ్బు జమచేసిన వ్యక్తిని పిలిచి విచారించారు. ఆ వ్యక్తి ముక్తియార్‌గంజ్‌లో ధాన్యం వ్యాపారుల వద్ద లెక్కలు రాసే వాడని తేలింది. అతణ్ని ఆదాయపన్ను అధికారులు మరింత లోతుగా విచారించినప్పుడు ఆశ్చర్యకరమైన అంశాలు బయటపడ్డాయి. అతడి ఖాతాలో వేసినట్టే ముక్తియార్‌గంజ్‌, మహారాజగంజ్‌, బేగంబజార్‌లలోని వివిధ రకాల వ్యాపారులు ఎవరో ఒక అనామకుడి ఖాతాలో పెద్దమొత్తంలో నగదు జమ చేస్తున్నారు. ఆ వెంటనే నగదును లాతూర్‌, ఉద్గిరి, అకోల తదితర ప్రాంతాల్లోని సరఫరాదారుల ఖాతాల్లోకీ ఆర్టీజీఎస్‌ ద్వారా మళ్ళిస్తున్నారు. డబ్బు ముట్టిన వెంటనే సరఫరాదారులు హైదరాబాద్‌లోని వ్యాపారులకు సరుకు పంపిస్తున్నారు. ఈ సరుకుకు ఎలాంటి పన్నులు చెల్లించకుండా ఇక్కడ అమ్మేసుకుంటున్నారు. వాస్తవానికి ఏ వ్యాపారికి సరుకు కావాలంటే అదే వ్యాపారి తన ఖాతాద్వారా నగదు చెల్లించాలి. అదే వ్యాపారి పేరుతో సరుకు సరఫరా జరగాలి. కాని ఇక్కడ నగదు బదిలీ అయ్యే ఖాతాకి, సరుకు సరఫరా అయ్యే వ్యాపారులకు ఎలాంటి సంబంధంలేదు. ఇదంతా పన్ను తప్పించుకునే అక్రమ వ్యాపారంగానే ఆదాయపన్ను శాఖ తేల్చింది. ఇలాంటి ఖాతాలు, వ్యాపారులు ఇంకా అనేక మంది ఉన్నట్లు గుర్తించిన అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*