నాన్నా.. నీ త్యాగానికి జోహార్లు!!

a-beautiful-story-of-a-father-and-his-son

ఇంజనీరింగ్ చదివే ఓ కుర్రాడు బైక్ కొనీయమని తన తండ్రిని ఎంతో కాలంగా అడుగుతున్నాడు. నెలలు గడిచినా తండ్రి అతడికి బైక్ కొనీయలేదు. ఓ రోజు ఇదే విషయమై తండ్రిని గట్టిగా నిలదీశాడు. అటు నుంచి ఏ స్పందనా రాకపోవడంతో.. బైక్ కొనీయలేవు కానీ కొడుకు మాత్రం ఇంజనీర్ చదవాలా అంటూ తన కోపాన్ని బయటపెట్టాడు. ఇంట్లో ఉంటే లాభం లేదనుకొని తండ్రి పర్సు తీసుకుని బయటపడ్డాడు. ఆ కంగారులో తన షూ బదులు నాన్న షూ వేసుకున్నాడు. జీవితంలో ఎదిగాక గానీ ఇంటికి తిరిగి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాడు. వడివడిగా నడుస్తోంటే షూలో ఏదో తగులుతోంది. షూ లోపల సాఫ్ట్‌గా లేకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉంది. కాసేపటికి కాలి మడమలో నొప్పి మొదలైంది. అయినా తండ్రి మీది కోపంతో ఆ కుర్రాడు నొప్పిని లెక్క చేయలేదు. కాస్త ముందుకు వెళ్లాక షూ లోపల తడిగా అనిపించింది. కాలు పైకెత్తి చూస్తే.. షూ అడుగున కన్నం కనిపించింది. దీంతో అలా ఇబ్బంది పడుతూనే బస్టాండ్‌కి వచ్చేశాడు. దగ్గర్లోని సిటీకి వెళ్దామని భావించిన అతడు ఎంక్వైరీలో అడిగితే మరో గంట దాకా బస్సు లేదని తెలిసింది. కాసేపు వెయిట్ చేద్దాం అనుకొని బస్టాండ్‌‌లోని బల్లమీద కూలబడ్డాడు. ఏదో ఎత్తుగా తగిలేసరికి ప్యాంట్ జేబులో నాన్న పర్సు ఉందనే విషయం గుర్తుకొచ్చింది. ఆ పర్సును తెరిచి చూశాడు. ఆఫీసులో తన తండ్రి తీసుకున్న రూ.40 వేల లోన్ స్లిప్ అందులో కనిపించింది. తన కోసం నాన్న కొనుగోలు చేసిన ల్యాప్‌టాప్ బిల్లు కూడా అందులోనే ఉంది. ఇంకా ఏమైనా ఉందేమోనని చూడగా.. ఆఫీసుకు వచ్చేటప్పుడు శుభ్రమైన షూతో రావాలంటూ మేనేజర్ ఇచ్చిన మెమో, దాంతోపాటు ‘పాత స్కూటర్ తెండి.. కొత్త మోటార్ సైకిల్ తో వెళ్ళండి.. గొప్ప ఎక్స్ఛేంజ్ మేళా’ అని రాసి ఉన్న కరపత్రం కూడా కనిపించాయి. వాటిని చూసే సరికి ఆ కుర్రాడికళ్ళు చెమర్చాయి. వెంటనే ఇంటికి పరిగెత్తాడు. ఇంటి నుంచి వచ్చేటప్పుడు నొప్పి పెట్టిన ఆ షూ ఇప్పుడు ఎలాంటి బాధను కలిగించలేకపోయాయి. ఇంటికి చేరే సరికి నాన్న లేడు. అమ్మను అడిగితే తన పాత స్కూటర్‌ను తీసుకొని ఎక్స్ఛేంజ్‌లో కొత్త బైక్ కొనేందుకు వెళ్లాడని చెప్పింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*