పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి: 2నెలలకే హత్య చేశాడు

a-woman-allegedly-killed-her-husband-maharashtra

వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను కూడా ఒప్పించి వివాహం కూడా చేసుకున్నారు. అయితే, పెళ్లైన రెండు నెలలకే కట్టుకున్న భార్యను హత మార్చాడు ఆ దుర్మార్గుడు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో చోటు చేసుకుందీ దారుణ ఘటన. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట పట్టణంలోని శ్రీశ్రీనగర్‌కు చెందిన గంపల లాజర్ సుజాత దంపతులకు ఐదుగురు కుమార్తెలు. వృత్తిరీత్యా మెకానిక్ అయిన లాజర్ నిత్యం కష్టపడి పనిచేస్తూ తన బిడ్డలను ఉన్నత చదువులు చదివించాడు. మూడవ కుమార్తె ప్రవళిక (26)ను ఎంఫార్మసీ వరకు చదివించాడు. కాగా, చివ్వెంల మండల పరిధిలోని కుడకుడ గ్రామానికి చెందిన పేరం జార్జి విమళ దంపతుల కుమారుడు రాంమనోహర్, ప్రవళిక గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి ఇరు కుటుంబాల వారిని ఒప్పించి గత ఆగస్టు 21వ తేదీన వివాహం చేసుకున్నారు. ఔరంగబాద్‌లోని ఐసిఐసి బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా రాంమనోహర్ ఉద్యోగం చేస్తుండడంతో మంచి ఉద్యోగమని భావించి లాజర్ దంపతులు పెళ్లికి అంగీకరించారు. వివాహం జరిగిన తర్వాత 20 రోజుల క్రితమే ప్రవళిక ఔరంగబాద్‌లో ఉన్న భర్త వద్దకు కాపురానికి వెళ్లింది. అక్టోబర్ 21న ప్రవళిక ఆత్మహత్యాయత్నం చేసిందని రాంమనోహర్ ఆమె తండ్రి లాజర్‌కు ఫోన్ చేశాడు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు అక్కడికి వెళ్లే సరికే ప్రవళిక మృతి చెందింది. మృతురాలి వంటిపై గాయాలు ఉండటంతో అదనపు కట్నం కోసం అల్లుడే తమ కుమార్తెను హతమార్చాడని లాజర్ ఔరంగబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు అక్కడి పోలీసులు కేసునమోదు చేసుకొని నిందితుడు రాంమనోహర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రవళిక మృతదేహాన్ని ఆదివారం సూర్యపేటకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. అదనపు కట్నం కోసమే రాంమనోహర్ తమ కుమార్తెను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశాడని లాజర్ దంపతులు ఆరోపించారు. రాంమనోహర్‌ను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*