ఆశా వర్కర్లకు రూ. 3 వేలు గౌరవ వేతనం పెంపు ..

తమకు వేతనాలు చెల్లించాలనే ప్రధాన డిమాండ్‌తో వచ్చే నెల 4 నుంచి ఆశా వర్కర్లు రాష్ట్రవ్యాప్త సమ్మెకు సిద్ధమైన నేపథ్యంలో శుక్రవారం ముఖ్యమంత్రి ఆశా వర్కర్స్‌ యూనియన్ల నాయకులతో చర్చించారు. ఆశా వర్కర్లకు ప్రతినెలా ఫిక్స్‌డ్‌గా రూ 3 వేలు గౌరవ వేతనం ఇస్తామనీ, కేంద్ర ఇచ్చే పారితోషకాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పారితోషకాలను పెంచి మరో రూ 3 వేలు తగ్గకుండా చెల్లిస్తామని ప్రకటించారు. అంతకు మించి పనిచేస్తే ఇతర పారితోషకాలు కలిపి ఆశాలు గరిష్టంగా రూ 8,600 సంపాదించుకోవచ్చని చెప్పారు.  ఆశా వర్కర్లందరికీ స్మార్ట్‌ ఫోన్లు అందజేసి, అందులోనే యాప్‌ డౌన్‌లోడ్‌ చేసి ఇస్తామన్నారు. దీనితో ఇక నుంచి రికార్డులన్నీ ఆన్‌లైన్‌లోనే నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజల ఆరోగ్యం, జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు పోషకాహారం, పరిశుభ్రత, ఆరోగ్యం వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో ఆశా వర్కర్లే అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి అన్నారు. పిహెచ్‌సి స్థాయిలో ఆరోగ్య ఉప కేంద్రం సేవలందించేలా త్వరలో ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టు ప్రారంభిస్తామన్నారు. అర్హులైన ఆశా వర్కర్లకు శిక్షణ ఇచ్చి, 2వ ఏఎన్‌ఎమ్‌లుగా తీసుకుంటామన్నారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ ఆశా వర్కర్లు క్షేత్రస్థాయిలో ఆరోగ్య నిపుణులుగా ఎన్నో సేవలందిస్తున్నారని అన్నారు. వైద్యఆరోగ్య శాఖ డైరెక్టర్‌ అరుణ కుమారి, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ జెడి వాసుదేవులు, ఇతర వైద్యాధికారులు, వివిధ జిల్లాల నుంచి ఆశా వర్కర్లు సమావేశంలో పాల్గొన్నారు. దశాబ్దాలుగా వేతనాల కోసం చేసిన పోరాట ఫలితంగానే సిఎం ఆశాలకు రూ 3 వేలు గౌరవ వేతనం, కేంద్రంతోపాటు సమానంగా పారితోషకాలు ప్రకటించారని ఏపి ఆశావర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు పిఎస్‌వి. రత్నం, ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. సిఎం ప్రకటనకు హర్షం వ్యక్తం చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*