ఎయిర్‌కోస్టాలో ముదిరిన సంక్షోభం

న్యూఢిల్లీ : విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసిన ఎయిర్‌కోస్టాలో సంక్షోభం మరింత తీవ్రతరమైంది. జీతాలు చెల్లించని కారణంగా గడిచిన కొద్దివారాల్లో 40 మందికి పైగా పైలట్లతోపాటు చాలామంది ఉద్యోగులు సంస్థను వీడినట్లుగా తెలుస్తున్నది. సర్వీసులందిస్తున్నప్పుడు సంస్థలో 450 మందికి పైగా ఉద్యోగులు పనిచేశారు. బుకింగ్‌ను మే నెల వరకు నిలిపివేసిన ఎయిర్‌కోస్టా.. నిధుల కొరతతో తీవ్రంగా సతమతమవుతున్న కారణంగా సర్వీసును పునఃప్రారంభించ లేకపోతున్నది. ఈ సంస్థలో తాజాగా మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటివరకైతే ఎవరూ కూడా ముందుకు వచ్చినట్లుగా కన్పించడం లేదు. పరిస్థితి చూస్తుంటే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కథ పునరావృతం కావచ్చని విమాన రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించిన ఎయిర్‌కోస్టా.. గతనెల 28న విమానయాన సేవలను నిలిపివేసింది. ఉద్యోగుల్లో ఎవ్వరికీ గతనెల జీతం అందలేదని, సగం మందికి పైగా జనవరి వేతనం కూడా చెల్లించనట్లు తెలుస్తున్నది. జీఈ క్యాపిటల్ ఏవియేషన్ సర్వీసెస్ ఈ సంస్థకు 3 విమానాలను లీజుకిచ్చింది. అద్దె చెల్లించడంలో ఎయిర్‌కోస్టా విఫలమవడంతో జీఈ క్యాపిటల్ ఏవియేషన్ ఒక విమానాన్ని వెనక్కి తీసుకుంది. దాంతో గత ఏడాది ఆగస్టులో ఒకసారి సంస్థ సర్వీసులను సస్పెండ్ చేయాల్సి వచ్చింది. అప్పట్లో సంస్థలో 600కు పైగా ఉద్యోగులుండేవారని.. ఆ తర్వాత క్రమంగా తగ్గుకుంటూ వచ్చి 450కి పడిపోయిందని, తాజా పరిణామంతో మరింత మంది కంపెనీకి గుడ్‌బై చెప్పారట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*