ఎయిర్‌టెల్ చేతికి టికోనా 4జీ

న్యూఢిల్లీ : దేశీయ టెలికం రంగంలో మరో కొనుగోలు ఒప్పం దం చోటు చేసుకుంది. దేశంలో అతిపెద్ద టెలికం సంస్థ ఎయిర్‌టెల్.. టికోనా నెట్‌వర్క్స్‌కు చెందిన 4జీ వ్యాపారంతోపాటు సంస్థకు చెందిన బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రాన్ని రూ.1600 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. టికోనాకు 5 టెలిక సర్కిళ్లలో ఉన్న 350 టవర్లు కూడా ఈ ఒప్పందంలో భాగమేనని స్టాక్ ఎక్సేంజ్‌లకు ఎయిర్‌టెల్ సమాచారం అందించింది. టికోనా ప్రస్తుతం గుజరాత్, ఉత్తర ప్రదేశ్ తూర్పు, పశ్చిమతోపాటు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ సర్కిళ్లలో 2,300 మెగాహెట్జ్ (ఎంహెచ్‌జెడ్) బ్యాండ్‌విడ్త్‌కు చెందిన 20 ఎంహెచ్‌జెడ్ స్పెక్ట్రం కలిగి ఉంది. ఈ ఒప్పందం పూర్తికాగానే ఈ ఐదు సర్కిళ్లలోనూ 4జీ సేవలను ప్రారంభించాలని ఎయిర్‌టెల్ భావిస్తున్నది.

ఈ డీల్ తర్వాత ఎయిర్‌టెల్.. దేశవ్యాప్తంగా 2,300 ఎంహెచ్‌జెడ్ బ్యాండ్‌విడ్త్ స్పెక్ట్రం కలిగిన రెండో టెలికం కంపెనీ కానుంది. అన్ని సర్కిళ్లలో 2,300 ఎంహెచ్‌జెడ్ కలిగిన మొదటి సంస్థ రిలయన్స్ జియో. టీడీ-ఎల్‌టీఈ (2300 ఎంహెచ్‌జెడ్ ద్వారా 4జీ సేవలందించగలిగే సాంకేతికత), ఎఫ్‌డీ-ఎల్‌టీఈ ( 1800 ఎంహెచ్‌జెడ్ ద్వారా 4జీ సేవలందించగలిగే సాంకేతికత), ఇంకా ఇతర స్పెక్ట్రం వనరులను పెంచుకోవడం ద్వారా సంస్థ నెట్‌వర్క్ మరింత బలోపేతం కానుందని భారతీ ఎయిర్‌టెల్ భారత, దక్షిణాసియా విభాగ ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ అన్నారు. అంతేకాదు, వినియోగదారులకు అత్యంత గరిష్ఠ వేగంలో బ్రాడ్‌బ్యాండ్ సేవలందించేందుకు దోహదపడనుందన్నారు. నోకియా ఎంబీఐటీ నివేదిక ప్రకారం.. దేశంలోని మొబైల్ వినియోగదారులు వాడుతున్న 4జీ హ్యాండ్‌సెట్లలో 97 శాతం ఎఫ్‌డీ-ఎల్‌టీఈ టెక్నాలజీకి, 90 శాతం టీడీ-ఎల్‌టీఈకి సపోర్ట్ చేయగలవు.

గత ఏడాది 4జీ సేవలతో సంచలన రంగ ప్రవేశం చేసిన రిలయన్స్ జియో.. దేశీయ టెలికం రంగంలో విలీనాలు, కొనుగోళ్ల ట్రెండ్‌కు తెరలేపింది. దేశంలో రెండు, మూడో అతిపెద్ద టెలికం సంస్థలుగా పేరున్న వొడాఫోన్ ఇండియా, ఐడియాలు విలీనం కాబోతున్నట్లు ఈవారంలో ప్రకటించాయి. అంతకుముందు, రిలయన్స్ కమ్యూనికేషన్స్.. ఎయిర్‌సెల్‌ను కొనుగోలు చేసింది. టికోనాతో ఒప్పందానికి ముందు ఎయిర్‌సెల్.. టెలినార్‌ను టేకోవర్ చేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*