అమెరికా అధికారులతో అజిత్‌ ధోవల్‌ భేటీ

వాషింగ్టన్‌: భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ ధోవల్‌ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన ఉన్నత స్థాయి అధికారులతో సమావేశాల్లో పాల్గొంటున్నారు. ధోవల్‌తో భేటీ అనంతరం భారత్‌, అమెరికాల మధ్య ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు పరస్పర సహకారం మరింత బలపడాలని కోరుకుంటున్నట్లు ట్రంప్‌ యంత్రాంగంలోని ఉన్నత స్థాయి అధికారులు వెల్లడించారు. ఈ వారంలో ధోవల్‌ అమెరికా రక్షణ విభాగం సెక్రటరీ రిటైర్డ్‌ జనరల్‌ జేమ్స్‌ మాట్టిస్‌, హోంల్యాండ్‌ సెక్యురిటీ సెక్రటరీ రిటైర్డ్‌ జనరల్‌ జాన్‌ కెల్లీ, అక్కడి జాతీయ భద్రత సలహాదారు లెఫ్టినెంట్‌ జనరల్‌ హెచ్‌ ఆర్‌ మెక్‌మాస్టర్‌లతో సమావేశమై భద్రతాపరమైన అంశాలు, ఉగ్రవాద వ్యతిరేక చర్యలపై చర్చించారు.

అన్ని సమావేశాల్లోనూ భారత్‌, అమెరికాల మధ్య పరస్పర సహకారం పెంపొందింపు, దక్షిణాసియా దేశాలకు పొంచి ఉన్న ఉగ్రవాద ముప్పు గురించి ఎక్కువగా మాట్లాడారు. డిఫెన్స్‌ సెక్రటరీ మాట్టిస్‌, అజిత్‌ ధోవల్‌ స్థానికపరమైన భద్రతతో పాటు తీర ప్రాంత భద్రత, ఉగ్రవాద వ్యతిరేకతపై చర్చించారు. ధోవల్‌ అమెరికా పర్యటనలో భాగంగా సెనెట్‌ ఆర్మ్‌డ్‌ సర్వీసెస్‌ కమిటీ ఛైర్మన్‌ సెనెటర్‌ జాన్‌ మెక్‌కైన్‌, సెనేట్‌ సెలక్ట్‌ కమిటీ ఆన్‌ ఇంటెలిజెన్స్‌ ఛైర్మన్‌ సెనేటర్‌ రిచర్డ్‌ బుర్‌లను కూడా కలిశారు. సమావేశాలన్నీ సానుకూల వాతావరణంలో జరిగాయని, నిర్ణయాత్మకమైనవని ధోవల్‌ వెల్లడించినట్లు భారత అధికార వర్గాలు తెలిపాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ధోవల్‌ రెండో అమెరికా పర్యటన ఇది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*