కొత్త నోటిఫికేషన్ ఇస్తాం

andhra-pradeshchandrababu-government-u-turn-on-swiss-challenge

స్విస్ ఛాలెంజ్ విధానం పైన ఏపీ ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. స్విస్ ఛాలెంజ్ విధానం పైన వెనక్కి తగ్గిన చంద్రబాబు ప్రభుత్వం, త్వరలో రాజధాని నిర్మాణం కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తామని, అప్పుడు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని హైకోర్టుకు బుధవారం నాడు తెలిపింది. రాజధాని నిర్మాణానికి అనుసరిస్తున్న స్విస్ ఛాలెంజ్ విధానంపై హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఎదుట దాఖలైన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు అడ్వోకేట్ జనరల్ హైకోర్టుకు ఈ రోజు తెలిపారు. బుధవారం విచారణ ప్రారంభం కాగానే ఈ విషయాన్ని ఆయన కోర్టుకు తెలియజేశారు. చట్టంలో ప్రభుత్వం అనేక మార్పులు చేసిందని, ఆ మార్పులకు అనుగుణంగా మళ్లీ తాజా నోటిఫికేషన్ ఇస్తామని పేర్కొన్నారు. మరో సింగిల్ బెంచి లేవనెత్తిన అంశాల మాట ఏమిటని బెంచ్ ప్రశ్నించింది. దీనిపై ఆయన మౌనం వహించారని తెలుస్తోంది. ఈ సందర్భంగా.. మళ్లీ విడుదల చేసే నోటిఫికేషన్ కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఉంటే తిరిగి హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది.  కాగా, స్విస్‌ ఛాలెంజ్‌ను వ్యతిరేకిస్తూ గతంలో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్‌ జడ్జితో కూడిన ధర్మాసనం స్విస్‌ ఛాలెంజ్‌ విధానంపై తాత్కాలిక స్టే విధించింది. సింగిల్‌ జడ్జి నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే ఈ అంశంలో తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు ఏపీ ప్రభుత్వం ఈ రోజు తెలపడం గమనార్హం. ఏపీఐడీఈ చట్టానికి సవరణ చేసినట్లు అడ్వకేట్‌ జనరల్‌ న్యాయస్థానానికి తెలిపారు. స్విస్‌ ఛాలెంజ్‌ విధానానికి సంబంధించి పాత నోటిఫికేషన్‌ ప్రక్రియను నిలిపివేసి కొత్త నోటిఫికేషన్‌ జారీ చేస్తామని తెలిపారు. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో రాజధాని అమరావతి నిర్మాణాన్ని సింగపూర్ కన్సార్టియంకు అప్పగించారు. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపణలు గుప్పిస్తోంది. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో నిర్మాణంపై వైసిపి నాయకులు కోర్టుకు ఎక్కి, రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని టిడిపి నేతలు మండిపడ్డారు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు ప్రభుత్వం యూ టర్న్ తీసుకోవడం గమనార్హం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*