అమరావతి నిర్మాణానికి సింగపూర్ తోడ్పాటు

andhra-pradesh/narendra-modi-on-amaravati

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టతనిచ్చారు. ఇప్పటికే రాజధాని అమరావతి నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వం , అక్కడి పలు నిర్మాణ కంపెనీలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలుమార్లు చర్చలు జరిపిన విషయం తెలిసిందే. కాగా, భారత పర్యటనలో ఉన్న సింగపూర్‌ ప్రధాని లీ సియన్‌.. ప్రధాని మోడీతో మంగళవారం భేటీ అయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో ప్రధాని మోడీని కలిసిన లీ సియన్‌ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం సహా పలు అంశాలపై చర్చించారు. భద్రత, వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలపై చర్చలు జరిపిన అనంతరం ఇరు దేశాల ప్రధానులు సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. భారత్‌, సింగపూర్‌ మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయని ప్రధాని మోడీ చెప్పారు. అంతేగాక, ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి సింగపూర్‌ తోడ్పడుతుందని స్పష్టం చేశారు. కాగా, గత సంవత్సరం పర్యటనలోనే ఇరు దేశాల మధ్య ఒప్పందాలపై రోడ్‌ మ్యాప్‌ తయారుచేశామని పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధి అంశంలో సింగపూర్‌తో ఒప్పందం కుదిరిందని ప్రకటించారు.నిరుడు భారత్‌- సింగపూర్‌ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరిందని సింగపూర్‌ ప్రధాని లీ సియోన్‌ వెల్లడించారు. ఇరు దేశాల వాణిజ్య సంబంధాలపై పరస్పరం చర్చించుకున్నామన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*