హిల్లరీ అధ్యక్షురాలైతే.. మూడో ప్రపంచ యుద్దం ఖాయం

another-world-war-clinton-s-syria-plan-could-spark-third-global-war

హిల్లరీ అనుసరిస్తోన్న విదేశాంగ విధానం ద్వారా భవిష్యత్తులో మూడో ప్రపంచ యుద్దం సంభవించే అవకాశముందని చఘాటైన విమర్శలు చేశారు రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్. హిల్లరీ విదేశాంగ విధాన ప్రణాళికలో భాగంగా.. సిరియాలో చేపట్టబోయే చర్యలు మూడో ప్రపంచ యుద్దానికి దారి తీసేవిగా ఉన్నాయన్నారు. హిల్లరీ విదేశాంగ విధాన ప్రణాళికలను తప్పుబడుతూ.. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న ఐసిస్ లాంటి ఉగ్ర సంస్థలను నిర్మూలించడానికి అమెరికా పూనుకోవాలని, కేవలం ఆ దేశ అధ్యక్షుడిని తొలగించడం ద్వారా ఒనగూరే ప్రయోజనం ఏముండదని ట్రంప్ వ్యాఖ్యానించారు. రాయ్‌టర్స్ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా.. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. సిరియాను ‘నో ఫ్లై’ జోన్ గా తయారుచేయాలని హిల్లరీ చేస్తోన్న ప్రతిపాదనను ట్రంప్ తప్పుబట్టారు. ఆ ప్రతిపాదన ర‌ష్యాతో ఘ‌ర్ష‌ణ‌కు దారితీసే ప్ర‌మాదం ఉంటుంద‌ని యూఎస్ మిలిట‌రీ చీఫ్ హెచ్చ‌రిస్తున్నారని గుర్తుచేశారు. ఇక తమ సొంత పార్టీ అయిన రిప‌బ్లిక‌న్స్‌పై కూడా ట్రంప్ విమ‌ర్శ‌లు గుప్పించడం గమనార్హం. పార్టీ అంతా ఒక్క తాటిపై ఉంటే హిల్లరీ తనను ఓడించలేరని అన్నారు. సిరియాలో అధ్యక్షుడిని తొల‌గించాలన్న ఆలోచనను పక్కనబెట్టి ఇస్లామిక్ స్టేట్‌ను అంత‌మొందించ‌డంపై దృష్టి సారిస్తే ప్రయోజనముంటుందని ట్రంప్ అన్నారు. రష్యా ఒక అణుదేశమని గుర్తు చేస్తూ.. త‌మ‌కు వ్య‌తిరేకంగా మాట్లాడే ఏ దేశంపైనైనా అది వాటిని ప్ర‌యోగిస్తుంద‌ని హెచ్చ‌రించారు. పుతిన్‌పై హిల్ల‌రీ విమ‌ర్శలు గుప్పించడాన్ని ఎత్తి చూపుతూ.. ఒక‌వేళ అమెరికాకు హిల్లరీ అధ్య‌క్షురాలైతే ఆయ‌న‌తో చ‌ర్చ‌లు ఎలా జ‌ర‌ప‌గ‌ల‌ర‌ని ప్ర‌శ్నించారు. రష్యాను బూచిగా చూపి అమెరికన్లను భయపెట్టేలా హిల్లరీ వ్యవహరిస్తున్నారని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*