కోస్తాంధ్రకు తుఫాను ముప్పు

ap-coast-put-on-alert-as-kyant-cyclone-moves-in

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన కయాంత్ తుఫాను విశాఖకు తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ఉత్తరాంధ్ర, ఒడిశా వైపు ప్రయాణిస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుపానుగా మారిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీనికి ‘కయాంత్’గా నామకరణం చేసినట్టు అధికారులు తెలిపారు. తుపాను ప్రస్తుతం పశ్చిమ నైరుతి దిశగా కదులుతోందని, ఈ రాత్రికి పోర్టు బ్లెయిర్‌ తీరానికి ఉత్తర వాయవ్యంగా 610 కిలోమీటర్ల దూరంలో, విశాఖ తీరానికి తూర్పు దిశలో 780 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో అంటే 27 లేదా 28 నుంచి తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. మత్య్సకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ ఈనెల 27న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి రానుంది. తుపాను ప్రభావం పైన విశాఖ కలెక్టర్‌ ప్రవీణ్ కుమార్‌, మంత్రి గంటా శ్రీనివాసరావు ధికారులతో మాట్లాడారు. జిల్లా అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి సూచించారు. ఈ తుఫాను ఎక్కడ తీరం దాటుతుందనేది తెలియడం లేదు. ఇది తీవ్ర రూపం దాలిస్తే మాత్రం ప్రమాదం భారీగానే ఉంటుందని భావిస్తున్నారు. ఈ నెల 29వ తేదీన ప్రకాశం, నెల్లూరు జిల్లాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే, అది క్రమంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు కదిలి, ఆ రాష్ట్రాల కోస్తా ప్రాంతాల్లో కూడా తీరం దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నెల 29వ తేదీన న్యూజిలాండ్, భారత్ మధ్య తలపెట్టిన వన్డే మ్యాచుపై కూడా దానివల్ల సందిగ్ధత నెలకొంది. రెండేళ్ల క్రితం హుదుద్ తుపాను కారణంగా విశాఖపట్నం అతలాకుతలమైంది. ఇప్పుడీ కయాంత్ తీవ్రరూపం దాలిస్తే తీవ్రమైన నష్టం కలగవచ్చునని భావిస్తున్నారు. తీరం వెంబడి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే ప్రమాదం ఉంది.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*