8వ రోజు ఏపి ఎంపిల ఆందోళన

పార్లమెంట్‌ ఆవరణలోనూ, ఉభయ సభల్లోనూ బుధవారం ఆందోళన కొనసాగించారు. తొలుత గాంధీ విగ్రహం వద్ద టిడిపి ఎంపిలు, గేట్‌ నెంబర్‌1 వద్ద వైసిపి ఎంపిలు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, విభజన హామీలు అమలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాల హోరెత్తించారు. ప్రతిరోజు వినూత్నంగా నిరసన తెలిపే చిత్తూరు ఎంపి శివప్రసాద్‌ బుధవారం కూడా కొనసాగించారు. క్రైస్తవ మత బోధకుని వేషధారణలో తన నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను కేంద్రం తక్షణమే నెరవేర్చేలా మనస్సు మార్చాలని ఏసు ప్రభువును వేడుకున్నారు. విభజన హామీలను నెరవేర్చాలని వినూత్న రీతిలో పాట పాడి తన గళాన్ని విన్పించారు. ఆ పాటలో ”విభజన హామీలను నెరవేర్చాలని, ప్రత్యేక హోదా ఇచ్చేలా మనస్సు మార్చాలని” శివ ప్రసాద్‌ పేర్కొన్నారు. లోక్‌సభలో టిడిపి, వైసిపి సభ్యులు వెల్‌లోకి వెళ్లి, స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు. వీరికి అన్నాడిఎంకె, టిఆర్‌ఎస్‌ ఇతర పార్టీల సభ్యులు తమ తమ డిమాండ్లతో తోడైయ్యారు. దీంతో సభలో గందగోళం నెలకొంది. సభ్యులు ఆందోళనల మధ్య సభ పలుసార్లు వాయిదా పడింది. ప్రత్యేక హోదాపై వైసిపి ఎంపి వైవీ సుబ్బారెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*