బెంగళూరులో ఆర్ఎస్ఎస్ నాయకుడి హత్య

bandh-shivajinagar-today-protest-killing-rss-activist

బెంగళూరు నగరంలో నిత్యం రద్దీగా ఉండే కమర్షియల్ స్ట్రీట్ సమీపంలో ఆర్ఎస్ఎస్ నాయకుడు, బీజేపీ నేతను హత్య చేశారు. స్నేహితులతో మాట్లాడుతున్న రుద్రేష్ (35) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు వేటకోడవళ్లతో నరికి అతి దారుణంగా హత్య చేశారు. ఆదివారం రుద్రేష్ శివాజీనగర్ లోని ఆర్ బీఏఎన్ఎమ్ఎస్ గ్రౌండ్ లో ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్ కార్యక్రమం ముగించుకుని బైక్ లో బయలుదేరారు. మార్గం మధ్యలో కామరాజ్ రోడ్డులో బైక్ పార్క్ చేసి తన ముగ్గురు స్నేహితులతో కలిసి మాట్లాడుతున్నారు. అదే సమయంలో రెండు బైక్ ల్లో వచ్చిన దుండగులు వేటకోడవళ్లతో రుద్రేష్ మీద దాడి చేసి పరారైనారు. తీవ్రగాయాలైన రుద్రేష్ ని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తీవ్రస్థాయిలో రక్తం పోవడంతో రుద్రేష్ మరణించాడని వైద్యులు దృవీకరించారు. విషయం తెలుసుకున్న ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కమర్షియల్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ శివాజీనగర్ మండల అధ్యక్షుడిగా పని చేస్తున్న రుద్రేష్ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. అంతే కాకుండా బీజేపీ శివాజీనగర్ శాసన సభ నియోజక వర్గం ప్రధాన కార్యదర్శిగా రుద్రేష్ పని చేస్తున్నారు. వేల సంఖ్యలో దుకాణాలు ఉండే శివాజీ నగర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రుద్రేష్ హత్యతో ఆందోళనలు ఎక్కువ కావడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. రుద్రేష్ హత్యకు నిరసనగా సోమవారం శివాజీనగర్ శాసన సభ నియోజక వర్గం మొత్తం బంద్ కు పిలుపునిచ్చారు. రెండు వర్గాలు వారు అధికంగా నివాసం ఉండే శివాజీనగర్ ప్రాంతాల్లో అల్లర్లు ఎక్కువ కాకుండా అదుపుచెయ్యడానికి పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. శివాజీనగర్, ప్రేజర్ టౌన్, కమర్షియల్ స్ట్రీట్, భారతీ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్ విధించారు. అదనపు బలగాలను రంగంలోకి దింపారు. ఇప్పటికే పాత నేరస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రుద్రేష్ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నాడనే కారణంతో అతనిని హత్య చేశారని బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*