బంగ్లా ‘వంద’నం

-శ్రీలంకపై చిరస్మరణీయ విజయం.. టెస్ట్ సిరీస్ 1-1తో సమం
కొలంబో: బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనే కాదు టెస్టుల్లోనూ మేటి జట్లను మట్టికరిపిస్తామని మరోమారు నిరూపించింది. శ్రీలంకను వారి సొంతగడ్డపైనే తుదముట్టిస్తూ తమ వందో టెస్ట్‌ను చిరస్మరణీయం చేసుకుంది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన టెస్ట్‌లో ముష్ఫీకర్ రహీమ్ సారథ్యంలోని బంగ్లా జట్టు 4 వికెట్ల తేడాతో లంకపై ఘనవిజయం సాధించింది. దీంతో రెండు టెస్ట్‌ల సిరీస్ 1-1తో సమమైంది. లంక నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా 57.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దిల్‌రువాన్ పెరెర(3/59), హెరాత్(3/75) విజృంభణతో ఓ దశలో 22 పరుగులకే సౌమ్య సర్కార్(10), ఇమ్రూల్ కయేస్(0) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (82), షబ్బీర్ రెహమాన్ (41) మూడో వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయానికి బాటలు వేశారు. ముఖ్యంగా తన కెరీర్‌లో 22వ అర్ధసెంచరీ ఖాతాలో వేసుకున్న తమీమ్ 7ఫోర్లు, సిక్స్‌తో అలరించాడు.

అయితే 58 పరుగుల తేడాతో తమీమ్, షబ్బీర్, షకీబల్ హసన్ (15), మొస్సాదెక్ హుస్సేన్ (13) వికెట్లు కోల్పోయింది. ఆఖర్లో కెప్టెన్ ముష్ఫీకర్ (22 నాటౌట్), మెహదీహసన్ (2 నాటౌట్) ఇన్నింగ్స్‌తో బంగ్లా విజయాన్నందుకుంది. అంతకుముందు 268/8 ఓవర్‌నైట్ స్కోరుతో ఐదోరోజు రెండో ఇన్నింగ్స్‌కు దిగిన లంక 319 పరుగులకు ఆలౌటైంది. దిల్‌రువాన్ పెరెర(50) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. షకీబల్ (4/74), ముస్తాఫిజుర్ రెహమాన్ (3/78) రాణించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన తమీమ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కగా, షకీబల్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ లభించింది.

సంక్షిప్త స్కోర్లు:
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 338 ఆలౌట్, బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 467 ఆలౌట్,
శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 319 ఆలౌట్, బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: 191/6.

4: టెస్టుల్లో విదేశీ గడ్డపై బంగ్లాదేశ్‌కు ఇది నాలుగో విజయం.
9:వంద టెస్టుల్లో బంగ్లాదేశ్‌కిది 9వ విజయం. జింబాబ్వేపై 5, వెస్టిండీస్‌పై 2, ఇంగ్లండ్,
శ్రీలంకపై ఒక్కోమ్యాచ్ గెలిచింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*