నోట్లరద్దుపై భారతిరాజా చిత్రం

చెన్నై: స్టూడియోల్లో సినిమా చిత్రీకరించే వ్యవస్థను పల్లె దారి పట్టించిన దర్శకుడు భారతిరాజా. మట్టి వాసనను చాటే పలు సినిమాలతో తెలుగు, తమిళ ప్రేక్షకుల మన్ననలు పొందారు. కొంతకాలంగా దర్శకత్వంపై పెద్దగా దృష్టి చూపలేదు. నటుడిగా పలు సినిమాల్లో కనిపించి ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం మళ్లీ దర్శకత్వంపై దృష్టి సారించారు. ‘ఓం’ అనే ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. లండన్‌ నేపథ్యంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో 60 ఏళ్ల వృద్ధుడిగా ఆయన నటిస్తున్నారు. విజయ్‌ ఏసుదాస్‌ నటిస్తున్న ‘పడై వీరర్‌’ చిత్రంలో కూడా నటిస్తున్నారు. మరో సినిమాకు కూడా దర్శకత్వం వహించేందుకు ఆయన సిద్ధమయ్యారు. తన ఆస్థాన కథా రచయిత రత్నకుమార్‌ కథకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో భారతిరాజాతో పాటు విదార్థ్‌ నటిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పెద్దనోట్ల రద్దుపై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆకస్మిక ప్రకటన వల్ల తన కుమార్తె పెళ్లి చేసేందుకు ఓ వ్యక్తి ఎదుర్కొన్న సమస్యలను వాస్తవిక కోణంలో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. హాస్యానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారట. సాధారణంగా తన సినిమాల్లో తొలుత ‘ఎన్‌ ఇనియ తమిళ్‌ మక్కలే’ (నా ప్రియమైన తమిళ ప్రజల్లారా) అని మాట్లాడతారు భారతిరాజా. వేదికపై ప్రసంగించేటప్పుడు కూడా ఈ మాటలను తప్పకుండా వాడతారు. ఎంతో గుర్తింపు పొందిన ‘ఎన్‌ ఇనియ తమిళ్‌ మక్కలే’ అనే మాటలనే సినిమా టైటిల్‌గా పెట్టారు. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*