‘జియో’వినియోగదారులకు శుభవార్త!

image-business-newsreliance-jio-likely-to-continue-free-services-till-march-analysts

అపరిమిత 4జీ డాటా, వాయిస్ కాల్స్, మెసేజ్‌లను ఉచితంగా అందిస్తోన్న రిలయన్స్ జియో తమ వినియోగదారులకు ఈ సేవలను మరో మూడు నెలల పాటు అందించనున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ ఉచిత సేవలతో కూడిన ‘జియో వెల్‌కమ్ ఆఫర్’ డిసెంబర్ 31 వరకు అందిస్తామని రిలయన్స్ జియో ఇదివరకే ప్రకటించింది. అయితే టెలీకాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)తో ఈ మధ్య జరిగిన సమావేశం అనంతరం వెల్‌కమ్ ఆఫర్ డిసెంబర్ 3తో ముగుస్తుందని కంపెనీ వెల్లడించింది. అయితే ఉచిత సేవలు మాత్రం డిసెంబర్ 31 వరకు వినియోగదారులకు అందుతాయని జియో స్పష్టం చేసింది.
మరోవైపు జియో ఉచిత సేవలను మార్చి వరకు పొడిగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. తమ సర్వీసులపై వినియోగదారులు సంతృప్తికరంగా లేరని ట్రాయ్, ప్రభుత్వానికి వివరించినట్లు జియో స్ట్రాటజీ, ప్లానింగ్ విభాగాధిపతి అన్షుమన్ ఠాకూర్ వెల్లడించారు. ఇంటర్ కనెక్షన్ రద్దీ వల్ల జియో వినియోగదారులు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు కూడా వివరించామని తెలిపారు. ఏదేమైనప్పటికీ వినియోగదారుడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నాణ్యతతో కూడిన సేవలు అందజేయడమే జియో లక్ష్యమని చెప్పారు. దీని కోసం జియో యంత్రాంగం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
జియో ఉచిత సర్వీసులను డిసెంబర్ తరవాత కూడా కొనసాగించడానికి ట్రాయ్ అనుమతి పొందాల్సిన అవసరం కూడా లేదని ఠాకూర్ చెప్పారు. దీనిని బట్టి చూస్తే జియో ఉచిత సర్వీసులను రిలయన్స్ సంస్థ మరిన్ని రోజులు పొడిగించే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే జియో వినియోగదారులకు నిజంగా శుభవార్తే కదా!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*