దేవుడి సొమ్ములో వాటాలా

chadalawada-krishna-murthy-hits-back-at-soudara-rajan

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు సౌందర్‌రాజన్‌కు చిత్తశుద్ధి ఉంటే వారి స్వపరిపాలనలో సాగుతున్న చిలుకూరి బాలాజీ ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖకు అప్పగించాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి సవాల్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి టిటిడి యాజమాన్యం 1000 కోట్లు చెల్లించాలని హైదరాబాద్‌లోని చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు సౌందర్‌రాజన్ మంగళవారం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో చదలవాడ ఆ సవాల్ విసిరారు. సౌందర్‌రాజన్‌కు తెలంగాణ ఆలయాల పరిరక్షణపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని తన స్వపరిపాలనలో సాగుతున్న చిలుకూరు బాలాజీ ఆలయాన్ని టి-రాష్ట్ర దేవాదాయ శాఖకు అప్పగించాలని హితవు పలికారు. స్వప్రయోజనాలు, స్వయం పరపతి పెంచుకోవడం కోసమే ఇటువంటివి ప్రచారం చేస్తున్నారని, దేవుడి సొమ్ములో వాటాలు అడగటం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. టిటిడి ఆదాయాన్ని ఖర్చు చేసేందుకు ఎపి ప్రభుత్వం వెనకడుగు వేస్తోందన్నారు. భక్తులు స్వామివారిపై ఉన్న అపార భక్తివిశ్వాసాలతో హుండీలో కానుకలు సమర్పిస్తారని, ఆ సొమ్మును స్వామి పేరుతో జరిగే ధార్మిక, సామాజిక కార్యక్రమాలకు టిటిడి వినియోగిస్తుందని గుర్తుచేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేవిధంగా శ్రీవారి ఆదాయంలో వాటాలు అంటూ పోరు పెట్టుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ అంశంపై పూర్తివివరాలు తెలుసుకునేందుకు, భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకునేందుకు టిటిడి ఇఓ సాంబశివరావు మంగళవారం సాయంత్రం టిటిడి న్యాయశాఖ అధికారులతో భేటీ అయినట్లు సమాచారం. ఇరు రాష్ట్రాలు విడిపోయే తేదీ వరకు టిటిడికి సంబంధించిన ఆదాయంలో తెలంగాణ రాష్ట్రానికి వాటా ఇవ్వాలని, 1987వ సంవత్సరం నుంచి 2014వ సంవత్సరం వరకు టిటిడి ఆదాయంలో దేవాదాయ శాఖకు చెల్లించాల్సిన 7 శాతం సిజిఎఫ్‌ను లెక్కిస్తే సుమారు 2,500 వేల కోట్లు టిటిడి బకాయి పడినట్లు తెలుస్తోందని, అందులో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా 1000 కోట్లు దాటుతుందని ఆయన పిటిషన్‌లో అన్నారు. రీ-ఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం వాటా అడిగే హక్కు తమకు ఉందని, ఆదాయపు లెక్కల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ వద్ద వీటికి సంబంధించిన వివరాలు ఉన్నాయని ఆయన పిటిషన్‌లో తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు టి-దేవాలయాలు సర్వనాశనం కావడానికి టిటిడినే ప్రధాన కారణమని, ఆలయాల నిర్వహణ, ఆదాయ విభజనకు సంబంధించి గత చట్టాలు ఏమీ అమలు కాలేదని ఆయన ఓ ప్రకటనలో విమర్శించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*