సీమపై ప్రత్యేక దృష్టి

chandrababu-focus-on-rayalaseema

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు మరోసారి రాయలసీమపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. రాజకీయ, సామాజిక కోణంలో ఇప్పటివరకూ టిడిపి పెద్దగా ఆదరణ చూపని రాయలసీమపై పట్టు సాధించే లక్ష్యంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకుని రాజకీయంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టిన బాబు.. ఇక అభివృద్ధి కోణంలో సీమ ప్రజలకు చేరువయ్యే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సొంత ప్రాంతానికి ఏమీ చేయడం లేదని, సీమపై పక్షపాతం చూపిస్తున్నారంటూ, మరో ఉద్యమానికి జనాలను సిద్ధం చేస్తున్న విపక్షాలను దెబ్బతీసేందుకు బాబు అడుగులు వేస్తున్నట్లు ఆయన కార్యాచరణ స్పష్టం చేస్తోంది. బాబు సీమవాసి అయినప్పటికీ కోస్తానాయకుడిగా పనిచేస్తున్నారన్న విమర్శలు గత కొంతకాలంగా నుంచి ఉధృతంగా వినిపిస్తున్నాయి. పోతిరెడ్డిపాడును ఎండబెడుతున్నారని, సీమలో ప్రాజెక్టులు రాకుండా కోస్తా, విశాఖకు తరలించుకుపోతున్నారంటూ సీమ నేతలు, మేధావులు అఖిలపక్షంగా ఏర్పడి ఆందోళన నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కడపలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణం కోసం ఇటీవల కడప జిల్లాలో జరిగిన భారీ ర్యాలీకి ప్రజలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. అనంతపురంలో జరిగిన జగన్ దీక్షకు సైతం ప్రజల నుంచి మంచి స్పందనే లభించింది. గత ఎన్నికల ముందు నుంచీ సీమలో రాజకీయ పరిస్థితి వైసీపీకి అనుకూలంగానే ఉంది. దీంతో బలంగా ఉన్న వైసీపీని దెబ్బతీసేందుకు బాబు రాజకీయ వ్యూహానికి తెరలేపారు. అందులో భాగంగానే సీమలో బలమైన నేతలు ఆదినారాయణరెడ్డి, భూమానాగిరెడ్డి, అమర్‌నాధ్‌రెడ్డి వంటి ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా వైసీపీని రాజకీయంగా దెబ్బకొట్టిన బాబు.. ఇప్పుడు అభివృద్ధి ద్వారా సీమ ప్రజలకు చేరువయ్యే లక్ష్యంతో వెళుతున్నారు. ఈ క్రమంలోనే మెగా రోడ్డు ప్రాజెక్టులపై సీరియస్‌గా దృష్టి సారిస్తున్నారు. అమరావతి నుంచి సీమ జిల్లాలకు ఎలాంటి మలుపులు లేకుండా నేరుగా వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణాల ద్వారా రోడ్డు కనెక్టివిటీతో సీమ రూపురేఖలు మార్చాలని సంకల్పించారు. అయితే ఈ నిర్మాణాలన్నీ కేంద్ర అనుమతులపై ఆధారపడి ఉన్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*