చంద్రబాబు ర్యాంకుల్లో ఏ-గ్రేడ్‌: సర్వే రిపోర్ట్‌లో పొగురుబోతు, ఎవరా ఎమ్మెల్యే?

chandrababu-naidu-issues-sealed-covers-warns-mlas

టీడీపీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ల పనితీరును బేరీజు వేస్తూ పార్టీ అధిష్ఠానం రూపొందించి అందజేసిన ప్రగతి నివేదికలపై నేతలు గుంభనంగా వ్యవహరిస్తోన్నారు. సీల్డ్‌ కవర్‌లో ఎనిమిది పేజీల నివేదికను అందజేసిన సీఎం చంద్రబాబు ఆ వివరాలు అత్యంత గోప్యంగా ఉంచాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. మూడు రోజుల పాటు గుంటూరులోని కేఎల్ యూనివర్సిటీలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు, ఎంపీలకు శిక్షణా తరగతులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా చివరి రోజైన గురువారం చంద్రబాబు సీల్డ్‌కవర్‌లో అందజేసిన ప్రగతి నివేదికలు గుంటూరు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారాయి. ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జిల పనితీరుపై ప్రజలేమనుకుంటున్నారన్న సమాచారం సీల్డ్‌ కవర్లలో ఉంది. సర్వేలో వచ్చిన సమాచారం ఆధారంగా వారికి గ్రేడ్‌ నిర్ణయించారని తెలుస్తోంది. ఇందులో భాగంగా అనధికారికంగా గుంటూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలకు జిల్లాలో ఏ-గ్రేడ్‌ వచ్చినట్లు సమాచారం. వారి నియోజకవర్గాల్లో పార్టీకి జరుగుతున్న నష్టం గురించి వివరించారు. అంతేకాదు సదరు నేత పట్ల ప్రజల్లో సంతృప్తి స్థాయి ఎంత? ఆ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు ఎలా అమలవుతున్నాయి? పార్టీ సమావేశాలకు హాజరవుతున్నారా? ఇలా అనేక అంశాలను ఈ ప్రగతి నివేదికల్లో పేర్కొన్నారని తెలుస్తోంది.  ప్రగతి నివేదికలో మొత్తం ఎనిమిది పేజీలు ఉండగా మొదటి పేజీలో గ్రేడింగ్‌, ఓటర్లు, నియోజకవర్గ వివరాలను పొందుపరిచారు. రెండో పేజీలో ఎమ్మెల్యేలు, ఇనచార్జిల బలాలు, బలహీనతలు విశ్లేషించారు. మూడో పేజీలో పార్టీ స్థితిగతిని వివరించారు. పార్టీపరంగా జరుగుతోన్న కార్య క్రమాలు, సమావేశాలు, సభలను ప్రస్తావించారు. ఐదో పేజీలో ఎమ్మెల్యే దందాలను పొందుపరిచారు. ఆరో పేజీలో గతంలో పార్టీలో క్రియాశీలకంగా పని చేసి, ఎమ్మెల్యే అయ్యాక స్తబ్ధతగా ఉన్న వైనాన్ని వివరించారు. ఇందుకు కొన్ని సంఘటనలను కూడా ఉదహరించారు. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా స్పందించక పోతుండటాన్ని కూడా ప్రస్తావించారు. ఏడో పేజీలో తప్పులు ఏ విధంగా సరిదిద్దుకోవాలనేది సూచించారు. ఎనిమిదో పేజీలో ప్రజలకు ఎంతమేరకు అందుబాటులో ఉంటున్నారు, నేతలు సరిగా లేకపోవడం వల్ల వైసీపీ ఏ విధంగా బలం పుంజుకొంటుందనేది పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఏ-గ్రేడ్‌ లభించిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరు అహంకారంగా వ్యవహరిస్తోన్నట్లు సర్వే రిపోర్టు వచ్చింది. ఇంకొకరు వర్గాలను పెంచి పోషిస్తున్నట్లు, మరొకరు కుటుంబ సభ్యులు దందా చేస్తున్నట్లు నివేదికల్లో పొందుపరిచినట్లు సమాచారం. ఇదిలా ఉంటే పనితీరు ఆధారంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన గ్రేడింగ్‌లపై జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల్లో విస్త్రృతంగా చర్చ జరుగుతుంది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు సర్వే చేయించడం, సర్వే ఆధారంగా వారికి ర్యాంకులు కేటాయించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా వారికి ఏ,బీ,సీ,డీ ర్యాంకులను కేటాయించారు. సీల్డ్ కవర్ల ద్వారా వారికి ఈ ర్యాంకులను అందజేశారు. ఇకపై ప్రతీ మూడు నెలలకు ఒకసారి ఇలానే సమీక్ష నివేదికలు అందజేస్తామని అన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*