‘ఎంటమ్మా ఇలా ఉంటే ఎలా’: బాబు వార్నింగ్, సభలో అపశృతి

chandrababu naidu, andhra pradesh, swachcha andhra pradesh, Read more at: http://telugu.oneindia.com/news/andhra-pradesh/chandrababu-on-swachcha-andhra-pradesh-186590.html

స్వచ్ఛాంధ్రప్రదేశ్ కోసం అందరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. అంతేగాక, పలు వ్యాధులకు కారణమవుతున్న దోమలను కూడా నివారించేందుకు అందరూ నడుం బిగించాలని అన్నారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా కాకినాడలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలతో బాబు ముఖాముఖి నిర్వహించారు. పాఠశాలలు, ప్రార్థనాలయాల దగ్గర పరిశుభ్రమైన వాతావరణం ఉండాలని సూచించారు. మహిళలు, విద్యార్థుల నుంచి సూచనలు అడిగి తీసుకున్నారు. అంతేగాక, పారిశుధ్య పనుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను ఈ సందర్భంగా చంద్రబాబు నిలదీశారు. ‘ఎంటమ్మా ఇలా ఉంటే ఎలా’ అంటూ నవ్వుతూనే సున్నితంగా మందలించారు. అంతేగాక, పద్ధతి మార్చుకోవాలని అధికారులకు కూడా హెచ్చరించారు. రాష్ట్ర విభజన తర్వాత చాలా సమస్యలు వచ్చాయని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. కాపు కార్పొరేషన్‌కు రూ. 1000 కోట్లు కేటాయించామని చెప్పారు. దేశంలోనే పింఛన్లు పెంచిన ఘనత ఏపీకే దక్కుతుందని బాబు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్‌ప్లాన్‌లు తీసుకొచ్చామన్నారు. చేతి వృత్తులవారికి పరికరాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. పేద విద్యార్థులకు విదేశీ చదువుల కోసం రూ. 10 లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తున్నామని సీఎం తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో ఎవరూ చదువు ఆపొద్దని కోరారు. సంచార వైద్యశాల కింద గ్రామాలకు వైద్యులను పంపుతున్నామని, పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ కింద బేబీ కిట్లు ఇస్తున్నామని తెలిపారు. కాకినాడలో రూ. 35వేల కోట్లతో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దీని వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. జిల్లాలో నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఏపీలోని అన్ని జిల్లాలు పరిశుభ్రంగా ఉండాలని అన్నారు. అధికారులు పారిశుద్ధ్యం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రజలు ప్రతీ వారాంతాన్ని సామాజిక కార్యక్రమాల కోసం వినియోగించుకోవాలని చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. సభలో అపశృతి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. స్వచ్ఛాంధ్రప్రదేశ్‌, దోమలపై దండయాత్ర కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కాన్వాయ్‌లోని మీడియా వాహనంపై నుంచి పాత్రికేయుడు మాధవకృష్ణ కింద పడిపోయారు. గాయపడిన మాధవకృష్ణను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి నిలకడగా ఉందని తెలిసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*