చినరాజప్పకు తప్పిన ముప్పు

chinna-rajappa-escapes-from-lift-accident

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు పెను ప్రమాదం తప్పింది. కాకినాడ సంజీవని ఆస్పత్రిలో ఒక్కసారిగా వైర్ తెగిపోవడంతో లిఫ్ట్‌ కిందకుపడిపోయింది. కాగా, లిఫ్ట్‌లో ఉన్న డిప్యూటీ సీఎం చినరాజప్పసహా పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో చినరాజప్ప నడుముకు గాయమైంది. వెంటనే స్పందించిన ఆస్పత్రి సిబ్బంది ఆయనకు చికిత్స అందించారు. పెద్దప్రమాదం తప్పడంతో మంత్రి అనుచరులు, ఆస్పత్రి సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. రొయ్యల శుద్ధి పరిశ్రమలో అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగింది. సీఫుడ్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్: 50మంది మహిళల అస్వస్థత తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలంలోని కట్టమూరు-జె.తిమ్మాపురం ప్రధాన రహదారికి సమీపంలో ఉన్న నెక్కంటి సీఫుడ్స్‌ పరిశ్రమలో సోమవారం అర్థరాత్రి గ్యాస్‌ లీకై 50 మంది మహిళలు ఆస్వస్థతకు గురైనట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో పరిశ్రమ సమీపంలో గ్రామస్థులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పెద్దాపురం పోలీసులు పరిశ్రమ వద్దకు చేరుకుని ఆందోళన కారులను చెదరగొట్టారు. పోలీసులు పరిశ్రమ లోపలి ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ పనిచేస్తున్న మహిళల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పరిశ్రమలో గ్యాస్‌ లీకేజీ కాలేదని తేల్చి చెప్పారు. ఏలేశ్వరం నుంచి పరిశ్రమలో పని చేయడానికి వచ్చిన రాజీ, భవానీ అనే ఇద్దరు మహిళలు వాతావరణం అనుకూలించక పోవడంతో అస్వస్థతకు గురయ్యారని, మెరుగైన చికిత్స కోసం వారిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పెద్దాపురం ఎస్సై సతీష్‌ తెలిపారు. కాగా, బాధితులను హోంమంత్రి చినరాజప్ప పరామర్శించారు. ఘటనకు సంబంధించి విచారణ చేపట్టాలని ఆదేశించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*