కోల్ ఇండియాపై 591 కోట్ల పెనాల్టీ

న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ కోల్ ఇండియాపై పోటీ రంగ నియంత్రణ మండలి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రూ.591 కోట్ల భారీ జరిమానా విధించింది. అంతేకాదు, మార్కెట్లో పోటీకి భంగం కలిగించే విధానాలను వెంటనే మానుకోవాలని సంస్థను నిర్దేశం చేసిన సీసీఐ.. ఒప్పందాలను తదనుగుణంగా సవరించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కొత్త, పాత లేదా ప్రైవేట్, ప్రభుత్వ విద్యుత్ సంస్థలన్న తేడా లేకుండా ఇంధన సరఫరా ఒప్పందాల్లో (ఎఫ్‌ఎస్‌ఏ) అందరికీ ఒకే నిబంధన వర్తింపజేయాలని తాజా ఆర్డర్ కాపీలో సీసీఐ..కోల్ ఇండియాను ఆదేశించింది. బొగ్గు సరఫరా విషయంలో కొన్ని సంస్థల పట్ల కోల్ ఇండియా పక్షపాతంగా వ్యవహరించిందన్న ఆరోపణలపై దర్యాప్తు చేసిన పోటీ రంగ నియంత్రణ మండలి తాజా నిర్ణయం తీసుకుంది. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బొగ్గు సరఫరాలో అనుచిత లేదా వివక్షాపూరిత నిబంధనలు విధించడం ద్వారా కోల్ ఇండియా పోటీ నియంత్రణ నిబంధనలు ఉల్లంఘించినట్లు తమ దర్యాప్తులో తేలిందని శుక్రవారం విడుదల చేసిన 56 పేజీల ఆర్డర్ కాపీలో సీసీఐ పేర్కొంది. ఇందుకుగాను, 2009-10 నుంచి 2011-12 ఆర్థిక సంవత్సరాల కాలానికి (మూడేండ్లకు) సంస్థ సరాసరి టర్నోవర్ ఒక శాతాన్ని (రూ.591.01 కోట్లు) పెనాల్టీగా విధిస్తున్నట్లు నివేదికలో వెల్లడించింది. కోల్ ఇండియాపై సీసీఐ భారీ పెనాల్టీ విధించడం ఇది రెండోసారి. తొలుత డిసెంబర్ 2013లో సంస్థపై రూ.1,773 కోట్ల జరిమానా విధిస్తూ సీసీఐ జారీ చేసిన ఆర్డర్‌ను కాంపిటీషన్ అపిల్లెట్ ట్రిబ్యునల్(కంపాట్) పక్కకు పెట్టింది. ఆరోపణలపై మరోసారి దర్యాప్తు చేయాలని నియంత్రణ మండలిని కంపాట్ కోరింది. ఆ ఆదేశాల మేరకు మళ్లీ దర్యాప్తు చేసిన సీసీఐ.. తాజాగా సంస్థపై రూ.591 కోట్ల పెనాల్టీ విధిస్తున్నట్లు ప్రకటించింది. మహారాష్ట్ర స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీ, గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ సంస్థలు కోల్ ఇండియా, దాని అనుబంధ విభాగాలైన మహానంది కోల్‌ఫీల్డ్స్, సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్ట్స్, వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ సంస్థలపై పోటీ నియంత్రణ మండలికి ఫిర్యాదు చేశాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*