కాగ్నిజెంట్‌లో 6 వేల మందిపై వేటు!

బెంగళూరు : అమెరికాకు చెందిన ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ భారీ స్థాయిలో ఉద్యోగులు కోత పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమారుగా 6 వేల మంది సిబ్బందిని తొలగించాలని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం. సంస్థలో ప్రస్తుతం పనిచేస్తున్న మొత్తం సిబ్బందిలో ఇది 2.3 శాతం. డిజిటల్ రంగంలో వస్తున్న పెనుమార్పులకు అనుగుణంగా తట్టుకోలేని సిబ్బందిపై వేటు వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. మార్చితో ముగిసిన సంవత్సరంలో మెరుగైన పనితీరు కనబరుచని సిబ్బందిని తొలగించడం పరిపాటిగా వస్తున్నదని, ఇదే క్రమంలో ఈ ఏడాది మొత్తం ఉద్యోగుల్లో కొందరిని తొలగించనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. గడిచిన రెండేండ్లుగా సంస్థలో పనిచేస్తున్న వారిలో 1-2 శాతం మంది సిబ్బందిని తొలగించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 31 నాటికి అంతర్జాతీయంగా సంస్థలో 2,60,200మంది విధులు నిర్వహిస్తుండగా, అదే భారత్‌లో 1.88 లక్షల మంది ఉన్నారు.

ఇంజినీర్లపై ఐటీ కంపెనీల దృష్టి
దేశీయ ఐటీ సేవల సంస్థలు మాత్రం ఉద్యోగ అవకాశాలపై దృష్టి సారించాయి. ఐటీ రంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రస్తుత సంవత్సరంలో నియమించుకునేవారిలో 40 శాతం మందిని ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులను ఎంపిక చేసుకోనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఐదు అతిపెద్ద సంస్థలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్ టెక్నాలజీలు 60 వేల మంది ఇంజినీరింగ్ విద్యార్థులను క్యాంపస్‌ల నుంచి నియమించుకున్నారు. అంతక్రితం ఏడాది నియమించుకున్న లక్ష మందితో పోలిస్తే తక్కువ.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*