వీణా-వాణీ: 14ఏళ్ల వ్యథ తీరేదెప్పుడు?

 

conjoined-twins-broken-promises-painful-story-veena-vani

గత 14ఏళ్లుగా ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్న అవిభక్త కవలలు వీణా-వాణీల శస్త్ర చికిత్స ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. దీంతో తమ అవిభక్త పిల్లలను చికిత్స ద్వారా వేరుచేసి స్వేచ్ఛా జీవితాన్ని అనుభవిస్తారని అనుకున్న వీణావాణీల తల్లిదండ్రుల బాధ అలాగే ఉండిపోతోంది. గతంలో ఢిల్లీకి చెందిన ఎయిమ్స్ వైద్యులు శస్త్ర చికిత్స ద్వారా వీణా వాణీలను వేరుచేస్తామని చెప్పినప్పటికీ సక్సెస్ రేటు తక్కువగా ఉందని వారు వెనుకడుగు వేశారు. ఆ తర్వాత లండన్ నుంచి వచ్చిన వైద్యులు కూడా మొదట సానుకూలత వ్యక్తం చేసి.. ఆ తర్వాత వారు కూడా విరమించుకున్నారు. సింగపూర్ నుంచి వచ్చిన వైద్యుల బృందం కూడా చికిత్సపై స్పష్టత ఇవ్వలేకపోయింది. ఈ నేపథ్యంలో తమకు ఏదైనా జీవన భృతిని కల్పిస్తేగానీ తమ పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లలేమని ఆ అవిభక్త కవలల తల్లిదండ్రులు చెప్పారు. కాగా, వీణావాణీల వయస్సు 12ఏళ్లు నిండినందున వారిని నీలోఫర్ నుంచి వేరే ఆస్పత్రికి తరలించనున్నట్లు ఇటీవల తెలంగాణ వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. చికిత్సపై మరోసారి ఎయిమ్స్ వైద్యులకు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో త్వరలోనే వీణా వాణీలను స్టేట్ హోంకు తరలించే అవకాశం ఉంది. కాగా, వీణావాణీల వయస్సు పెరుగుతున్న కారణంగా వారిని విడదీసే అవకాశాలు తగ్గుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం వీణావాణీల వయస్సు 14ఏళ్లు. నల్గొండలో జన్మించిన ఈ అవిభక్త కవలల ఆపరేషన్ అంశం తొలిసారి డిసెంబర్ 2004లో వెలుగులోకి వచ్చింది. గుంటూరులోని జనరల్ ఆస్పత్రిలో డాక్టర్ యార్లగడ్డ నాయుడమ్మ తొలి దశ ఆపరేషన్ చేశారు. కాగా, ఈ క్రమంలో రాజకీయ నాయకులు, అధికారులు ఆస్పత్రిని తరచూ సందర్శించడం వల్ల వీణావాణీల విషయంపై మీడియాలో ప్రచారం ఎక్కువగా జరిగింది. పేదరికం కారణంగా వీణావాణీల తల్లిదండ్రులు వారికి శస్త్రచికిత్స చేయించలేక ప్రభుత్వ సాయాన్ని కోరారు. 2006లో గుంటూరు ఆస్పత్రి నుంచి హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి వీణావాణీలను తరలించడం జరిగింది. అప్పట్నుంచి ఈ అవిభక్త కవలలు అక్కడే ఉంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*