విశాఖలో నేరాల తీవ్రత స్థిరంగా ఉందని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కె.వి.రవీంద్రనాధ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు డీజీపీ ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా మంగళవారం సిరిపురంలోని వీఎంఆర్డిఏ చిల్డ్రన్ ఏరినాలో జిల్లా స్థాయి అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని విశాఖ పర్యటన విజయవంతం అయిందని, విశాఖ వారు మాత్రమే కాకుండా బయట జిల్లాల నుండి వచ్చిన పోలీసు అధికారులు కూడా అద్భుతంగా పనిచేశారని అన్నారు. విశాఖ కమిషనరేట్ పరిధిలో విశాఖపట్నంలోని నేరాల తీవ్రత స్థిరంగా ఉందని హత్యాయత్నాలు, అత్యాచారాలు తగ్గాయని, హత్యలు, రోడ్డు ప్రమాదాల తీవ్రత స్థిరంగా ఉందని అన్నారు. ఈ మధ్య కాలంలో పోలీస్ శాఖ వారు ఎంతో చొరవ చూపించి 47 వేల కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించడం జరిగిందని అందులో 36000 కేసుల ఐపీసీ పరిధిలోనివని తెలిపారు. వీటితో పాటు ఒక లక్ష వరకు పెట్టి కేసులు కూడా పరిష్కారం చేశామని అన్నారు. ముఖ్యంగా ప్రధానమైన కేసులలో ఎస్పీ లేదా కమిషనర్ స్థాయి అధికారులు స్వయంగా విచారణ జరిపే విధంగా ప్రణాళికలు రూపొందించామని, ఈ ప్రణాళికలో భాగంగా విశాఖ కమిషనరేట్ పరిధిలో మహారాణిపేట, ఆరిలోవ, గోపాలపట్నం, పోలీస్ స్టేషన్లో పరిధిలో సుమారు 10కి పైగా కేసులను చేదించి నిందితులకు శిక్షలు వేయించామని, అదే విధంగా గంజాయి సాగు , అక్రమ రవాణాలలో ఇప్పటివరకు 159 కేసులు నమోదు చేశామని 1,32,000 కేజీల గంజాయి సీజ్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అదే విధంగా ఈ గంజాయి అక్రమ రవాణాలో ప్రధాన నిందితులను అరెస్టు చేసే క్రమంలో 10 -12 రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నామని ప్రధాన నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. నక్సలైట్ ప్రభావిత ప్రాంతమైన ఆంధ్ర – ఒరిస్సా బోర్డర్ లో ఇప్పటికి నక్సలైట్లు ప్రభావం ఉందని దానిపై ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. సైబర్ క్రైమ్ నేరాలపై అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బందికి ఇప్పటికే అనంతపురంలోని శిక్షణా కేంద్రంలో శిక్షణ ఇప్పించినట్లు అదే విధంగా లోన్ ఆప్స్ నియంత్రణకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని దీనితో పాటు సైబర్ క్రైమ్ లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రధాన కూడళ్లలో హోర్డింగులు బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అతి త్వరలోనే రాష్ట్రంలో సైబర్ క్రైమ్ పై ప్రత్యేక డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనున్నామని అన్నారు. త్వరలోనే తమ శాఖలో 6,500 ఖాళీలు భర్తీ చేయనున్నామని అది పూర్తయిన పోలీస్ శాఖలో వీక్లీ ఆఫ్ విధానాన్ని అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని ఆయన తెలిపారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ మధ్య కాలంలో విశాఖ గర్జన రోజున జరిగిన సంఘటనకు సంభందించి అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని సంఘటనలో ఎవరి మీద కూడా తప్పుడు కేసులు పెట్టలేదని వీడియో ఫుటేజ్ ఆధారంగానే కేసులు నమోదు చేశామని ఆయన స్పష్టం చేశారు. ఈ మధ్య కాలంలో సామజిక మాధ్యమాల్లో వస్తున్న నేతల అస్లీల ఆడియోలు, వీడియోలు పై మీడియా ప్రశ్నకు సమాధానంగా ఇటువంటి ఆడియోలు , వీడియోలపై వెనువెంటనే నిజ నిర్ధారణ చేసే సాంకేతికత ఇంకా అందుబాటులోకి రాలేదని అన్నారు. పరివర్తన కార్యక్రమంపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాష్ట్రంలోని చివరి గంజాయి మొక్క నాశనం అయ్యే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేసారు. సమావేశంలో ఉత్తరంద్ర రేంజ్ డిఐజి హరికృష్ణ , విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ సి.హెచ్.శ్రీకాంత్, డిప్యూటి పోలీస్ కమిషనర్ లా అండ్ ఆర్డర్ సుమిత్ సునీల్ గరుడ్ తదితరులు పాల్గొన్నారు.