ట్రంప్‌కు మిచెల్లీ హెచ్చరిక

donald-trump-s-comments-have-shaken-me-my-core-michelle

అమెరికా ప్రథమ పౌరురాలు మిచెల్లీ ఒబామా మరోసారి రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్రంగా మండిపడ్డారు. మహిళలు, సెక్స్‌పై ట్రంప్ చేస్తున్న అసభ్యకరమైన వ్యాఖ్యలు సహించరానివని అన్నారు. ఇప్పటి వరకు వరకు చేసిన వ్యాఖ్యలు చాలని, పిచ్చి ప్రేలాపనలు కట్టిపెట్టాలని గట్టిగా హెచ్చరించారు. డెమోక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు మద్దతుగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో మిచెల్లీ మాట్లాడారు. మహిళలపై ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు తనను దిగ్భ్రాంతికి గురిచేశాయన్నారు. సాధారణ మనిషిలా కూడా ఆయన ప్రవర్తించడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. లైంగిక స్వేచ్ఛ అంటే ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించడం కాదని మిచెల్లీ గట్టిగా చెప్పారు. మహిళలను బలవంతంగా ముద్దు పెట్టుకోవడం, వారిని అసభ్యంగా తాకుతూ పైశాచికానందం పొందడం తీవ్రమైన నేరాలేనని అన్నారు. ఇలాంటి సహించకూడదన్నారు. ఇటీవల ఓ ఇద్దరు మహిళలు తమను లైంగిక వేధించాడని, అనుమతి లేకుండా తమను బలవంతంగా ముద్దులు పెట్టుకున్నాడని, తాకరాని చోట్ల తాకారని ట్రంప్‌పై ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. మీడియాల్లో కూడా ఈ మేరకు కథనాలు వెలువడ్డాయి. మహిళల పట్ల ట్రంప్‌ది క్రూరమైన వైఖరని, మహిళలను బెదరింపులకు గురిచేయడం సహించకూడదని అన్నారు. కాగా, ట్రంప్‌పై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు అతని అభ్యర్థిత్వంపై తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయి. అధ్యక్ష బరిలో హిల్లరీ క్లింటన్ వివాదరహితంగా దూసుకుపోతుండగా, ట్రంప్ మాత్రం గతంలో చేసిన అసభ్యకర పనులు, ఇప్పుడు మహిళలపై అసభ్యకరంగా చేస్తున్న వ్యాఖ్యలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ వెనకబడిపోతున్నారు. కన్న కూతురుపై కూడా ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*