ధోనీ బృందానికి తప్పిన ముప్పు

న్యూఢిల్లీ: ధోనీతో పాటు సహచర ఆటగాళ్లకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తాము బసచేస్తున్న హోటల్లో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. సకాలంలో అప్రమత్తంగా వ్యవహరించడంతో ఆటగాళ్లంతా క్షేమంగా బయటపడ్డారు. వివరాల్లోకెళితే.. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బెంగాల్ జట్టుతో సెమీఫైనల్ మ్యాచ్ ఆడేందుకు ధోనీ సారథ్యంలోని జార్ఖండ్ జట్టు సభ్యులంతా దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలోని వెల్‌కమ్ హోటల్లో బసచేస్తున్నారు. అయితే, శుక్రవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో హోటల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే హోటల్‌కు చేరుకొని మంటలను అదుపుచేయడంతో క్రికెటర్లు సహా అంతా ఊపిరిపీల్చుకున్నారు. దాదాపు 30కిపైగా ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. అయితే, ఈ ఘటనలో జార్ఖండ్ జట్టు ఆటగాళ్ల కిట్ మొత్తం మంటల్లో బూడిదైపోయింది. దీంతో బెంగాల్, జార్ఖండ్ జట్ల మధ్య జరుగాల్సిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌ను శనివారానికి వాయిదా వేశారు. ఆదివారం జరుగాల్సిన ఫైనల్ మ్యాచ్ సోమవారానికి వాయిదా పడింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*