కొత్త సచివాలయంలో ఉద్యోగుల తిప్పలు!

hard-time-velagapudi-employees-ap

పూర్తి స్థాయి నిర్మాణం జరగకపోవడం.. సరైన మౌళిక సదుపాయాలు కల్పించకపోవడంతో.. వెలగపూడిలోని కొత్త సచివాలయంలో పనిచేస్తోన్న ఉద్యోగులంతా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా కొన్ని నిర్మాణాలకు సంబంధించిన పనులు ఇంకా కొనసాగుతుండడంతో.. దుమ్ము ధూళితో ఉద్యోగుల పనులకు ఆటంకం కలుగుతోందని చెబుతున్నారు. సచివాలయ నిర్మాణం పొలాలను ఆనుకుని ఉండడంతో.. కార్యాలయాల్లోకి వస్తోన్న పురుగులతో ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగులు. ముఖ్యంగా నల్లగా ఉండే కొన్ని పురుగుల వల్ల భరించలేని దుర్గంధం వ్యాప్తి చెందుతుండడంతో.. పనులు చేయడం కష్టంగా మారిందంటున్నారు. ఉదయం ఆఫీస్ లోకి ఎంటరయ్యే సమయానికే.. చాలా సంఖ్యలో నల్ల పురుగులు ఆఫీస్ టేబుల్స్ మీద దర్శనమిస్తుండడంతో ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిదాకా సచివాలయంలో ల్యాండ్ ఫోన్లు కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. ల్యాండ్ ఫోన్ సౌకర్యం ఏర్పాటు చేయడానికి మరో నెల పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇక టాయ్ లెట్లు కూడా పరిశుభ్రంగా లేకపోవడంతో.. తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లుగా సమాచారం. క్యాంటీన్ లో భోజనానికి వెళ్లిన సందర్బంలోను చాలాసేపు క్యూ లో నిలబడాల్సి వస్తోందని ఉద్యోగులు వాపోతున్నారట. ఇవన్నీ చూసి.. వెలగపూడిని కాస్త వెతలపూడి అంటూ అభివర్ణిస్తున్నారు పలువురు. కాగా, సచివాలయంలో సీఎం కార్యాలయంతో పాటు సీఎస్ కార్యాలయం పనులు కూడా ఇంకా నిర్మాణంలోనే ఉండడంతో.. ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నట్లుగా సమాచారం. 11వ తేదీ నాటికే ఈ పనులన్నీ పూర్తి కావాల్సి ఉన్నా.. అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో.. ముహూర్త సమయానికి సీఎస్ టక్కర్ తన కార్యాలయంలోకి అడుగుపెట్టలేదు. సీఎం చాంబర్ మాత్రమే సిద్దం చేసిన అధికారులు.. సీఎంవో అధికారులకు చాంబర్లు సిద్దం చేయడానికి మరో నెల రోజులు పడుతుందని తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*