క్యుమిన్స్‌ భారత్‌లో రాణించగలడు

దిల్లీ: భారత్‌-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు గురువారం ప్రారంభం కానుంది. రెండో టెస్టు అనంతరం గాయపడిన ఆసీస్‌ ఆటగాళ్లు మూడో మ్యాచ్‌కు దూరమయ్యారు. గాయాలపాలైన మిచెల్‌ మార్ష్‌, మిచెల్‌ స్టార్క్‌ స్వదేశానికి పయనమైన సంగతి తెలిసిందే. వీరి స్థానంలో రాంచీలో జరగబోయే మూడో టెస్టులో ఆసీస్‌ తుది జట్టులో అవకాశం ఎవరిని వరిస్తుందోనని ఆసక్తి నెలకొంది.

ఈ నేపథ్యంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా పాట్‌ క్యుమిన్స్‌ను పిలిపించింది. గాయం కారణంగా గతంలో జట్టుకు దూరమైన క్యుమిన్స్‌ ఐదు సంవత్సరాల తర్వాత జాతీయ జట్టులోకి తిరిగొచ్చాడు. 2011 నవంబరులో క్యుమిన్స్‌ దక్షిణాఫ్రికాపై అద్భుత ప్రదర్శన కనబరిచాడు. కీలక సమయంలో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 6వికెట్లు తీసి ఆసీస్‌ జట్టుకు విజయాన్ని అందించాడు. కెరీర్‌లో అతడు ఆడింది ఆ ఒక్క టెస్ట్‌ మాత్రమే. అయితే క్యుమిన్స్‌ భారత్‌లో రాణించగలడని న్యూ సౌత్‌ వేల్స్‌ సారథి మోయీస్‌ హెన్రీక్యూ ఆశాభావం వ్యక్తం చేశాడు. క్యుమిన్స్‌ ప్రత్యేకమైన బౌలరని, ఇప్పుడు అతడు ఎంతో ఫిట్‌గా ఉన్నాడని వివరించాడు. ఇప్పటికే భారత్‌ చేరుకున్న క్యుమిన్స్‌ రాంచీ మైదానంలో ప్రాక్టీసు కూడా మొదలు పెట్టేశాడు. మార్కస్‌ స్లోయినిస్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, అష్టన్‌ అగర్‌, ఉస్మాన్‌ ఖవాజాతో పాటు పలువురు ఆటగాళ్లు మార్ష్‌, స్టార్క్‌ స్థానాల కోసం పోటీ పడుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*