దుబాయ్‌ వేదికగా భారత్‌-పాక్‌ సిరీస్‌?

దిల్లీ : భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ జరిగే అవకాశాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ ఏడాది చివర్లో పాక్‌తో దుబాయ్‌ వేదికగా క్రికెట్‌ ఆడేందుకు బీసీసీఐ ఆసక్తి చూపుతున్నట్లు.. దీనికి అనుమతి కోసం కేంద్ర హోంశాఖను సంప్రదించినట్లు సమాచారం.

2014 ఒప్పందం ప్రకారం పాక్‌తో భారత్‌ ద్వైపాక్షిక సిరీస్‌ ఆడాల్సి ఉంది. అయితే ఇరు దేశాల సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ఉగ్రదాడుల నేపథ్యంలో భారత ప్రభుత్వం టీమిండియాకు అనుమతి ఇవ్వలేదు. 2016 ఆరంభంలో ద్వైపాక్షిక సిరీస్‌కు యూఏఈ వేదికను బీసీసీఐ తిరస్కరించింది. అనంతరం గత ఏడాది చాలా ప్రయత్నాలు జరిగినప్పటికీ ద్వైపాక్షిక సిరీస్‌ అంశం ముందుకు కదలలేదు. అయితే ప్రస్తుతం ఈ సిరీస్‌ను సెప్టెంబర్‌ లేదా నవంబర్‌లో ఆడేందుకు బీసీసీఐ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

‘ద్వైపాక్షిక సిరీస్‌కు సంబంధించి అనుమతి కోసం కేంద్ర హోంశాఖను సంప్రదించాం. ప్రస్తుతం ప్రభుత్వ వైఖరి ఏంటో మాకు తెలియదు. గతంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సిరీస్‌కు అనుమతి లభించలేదు. ఒప్పందం ప్రకారం పాక్‌తో సిరీస్‌ ఆడాల్సి ఉంటుంది. దీనికోసం దుబాయ్‌ వెళ్లాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం అనుమతి ఇస్తే తప్ప.. బీసీసీఐ ఏమీ చేయలేదు’ అని బీసీసీఐ పేర్కొన్నట్లు సమాచారం.

పాకిస్థాన్‌తో భారత్‌ చివరిసారిగా టెస్టు సిరీస్‌ను 2007-08లో, వన్డే సిరీస్‌ను 2012-13లో ఆడింది. ఇరు జట్లు చివరిసారిగా 2016 మార్చిలో టీ20 ప్రపంచకప్‌లో తలపడ్డాయి. పాకిస్థాన్‌ తమ దేశంలో ఆడాల్సిన మ్యాచ్‌లను యూఏఈ వేదికగా ఆడుతున్న విషయం తెలిసిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*