మళ్లీ సర్జికల్ స్ట్రైక్ దాడులు చేస్తాం: భారత ఆర్మీ

indian-army-briefs-parliamentary-panel-on-surgical-strikes

అవసరతమైతే పాక్ అక్రమిత కాశ్మీర్ లోకి వెళ్లి మళ్లీ సర్జికల్ స్ట్రైక్ దాడులు చేస్తామని పార్లమెంటరీ స్థాయి సంఘం (పార్లమెంటరీ స్టాండింగ్ కమిటి)కి భారత సైన్యం ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. సర్జికల్ స్ట్రైక్ దాడుల సాక్షాలు చూపాలని కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో భారత ఆర్మీ తొలిసారిగా కొందరు ఎంపీలకు సర్జికల్ స్ట్రైక్ వివరాలను తెలియజేసింది. సర్జికల్ స్ట్రైక్ దాడులు జరిగిన తరువాత ఆర్మీ డీజీఎంఓ రణ్ బీర్ సింగ్ మీడియాతో మాట్లాడారు. డీజీఎంఓ రణ్ బీర్ సింగ్ మీడియాతో మాట్లాడిన తరువాత ఆర్మీ మొదటి సారి స్పందించింది. భారత సైన్యం వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ స్వయంగా ఎంపీల దగ్గరకు వెళ్లి సర్జికల్ స్ట్రైక్ దాడుల వివరాలు చెప్పారు. ఎల్ వోసీ వెంబడి కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాదులు మకాం వేసి భారత్ లోకి చొరబడటానికి ప్రయత్నిస్తున్నారని, జమ్మూ కాశ్మీర్ లోని కొన్ని ప్రాంతాలను లక్షంగా చేసుకుని దాడులు చేయడానికి సిద్దం అయ్యారని సమాచారం వచ్చిన తరువాత మన సైన్యం దాడులు చేసిందని వివరించారు. సర్జికల్ స్ట్రైక్ దాడులు ఒక్క సారి చేసే చర్య అని ఎంపీలకు చెప్పారు, అయితే అవసరమైతే మళ్లీ సర్జికల్ స్ట్రైక్ దాడులు చెయ్యడానికి తాము సిద్దంగా ఉన్నామని భారతీయ డీజీఎంఓ రణ్ బీర్ సింగ్ పాకిస్థాన్ డీజీఎంఓకు చెప్పారని లెఫ్టినెంట్ జనరల్ రావత్ వివరించారు. ఎంపీలతో ఆర్మీ భేటీ అవుతుందని ఒక సారి, వాయిదా పడిందని మరో సారి చెప్పడంతో కాంగ్రెస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఈనేపధ్యంలో జనరల్ రావత్ స్వయంగా వెళ్లి ఎంపీలను కలిసి మొత్తం వివరాలు వాళ్లకు చెప్పారు. సర్జికల్ స్ట్రైక్ ఆపరేషన్ ఎలా జరిగింది, ఉగ్రవాద శిబిరాలకు ఎంత నష్టం వాటిల్లిందో కూడా వివరించారు. సర్జికల్ స్ట్రైక్ దాడులు చేసిన భారత సైనికులు అందరూ క్షేమంగా తిరిగి వచ్చారని జనరల్ రావత్ వివరించారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ మీద దాడి, ఉరీ ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్రవాదులు మరింత రెచ్చిపోతున్నారని భారత ఆర్మీ పసిగట్టింది. ఈ విషయంపై సమగ్రంగా చర్చించిన తరువాతే సర్జికల్ స్ట్రైక్ దాడుల ఆపరేషన్ కు ప్లాన్ వేశామని చెప్పారు. ఆర్మీ అధికారులు సర్జికల్ స్ట్రైక్ దాడులు గురించి పూస గుచ్చినట్లు వివరించడంతో పార్లమెంటరీ స్థాయి సంఘంలోని చాల మంది సభ్యులు సంతృప్తి చెందడంతో ఎవరూ ప్రశ్నలు వేయలేదని స్థాయి సంఘం చైర్మన్ ఖండూరీ తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*