‘జూనియర్‌ నోబెల్‌’ విజేత ఇంద్రాణి దాస్‌

వాషింగ్టన్‌: అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సైన్స్‌, గణిత పోటీలో భారత సంతతికి చెందిన ఇంద్రాణి దాస్‌ (17) మొదటిస్థానంలో నిలిచి, 2.5 లక్షల డాలర్లను గెల్చుకుంది. మెదడుకు గాయాల వల్ల, నాడీక్షీణత వ్యాధుల వల్ల న్యూరాన్లు చనిపోకుండా నివారించే అంశంపై ఆమె సాగించిన పరిశోధనకు పురస్కారం దక్కింది. పోటీలో భారత సంతతికి చెందిన మరో నలుగురు విద్యార్థులు తొలి పది స్థానాల్లో నిలిచారు.రీజెనెరాన్‌ సైన్స్‌ టాలెంట్‌ సెర్చ్‌ అవార్డ్స్‌ పోటీలో సైన్స్‌, గణితంలో అసాధారణ ప్రతిభ చూపినవారిని ఎంపిక చేస్తారు. దీన్ని జూనియర్‌ నోబెల్‌ పురస్కారంగా పేర్కొంటారు.

నాడీ కణాల మరణానికి ఆస్ట్రోగ్లియోసిస్‌ అనే స్థితి కారణమవుతోంది.గాయాలకు స్పందనగా ఆస్ట్రోసైట్స్‌ అనే కణాలు వృద్ధి చెంది, విభజన చెందుతాయి. ఈ కణాలు ఎక్కువైతే నాడీ కణాలకు విషతుల్యంగా పరిణమిస్తాయి. ఆస్ట్రోసైట్స్‌ నుంచి ఎక్సోజోమ్స్‌ను వేరుచేసి, మైక్రోఆర్‌ఎన్‌ఏ-124ఏను చొప్పించడం వల్ల ఆస్ట్రోసైట్‌ల్లో గ్లుటమేట్‌ను గ్రహించే ప్రక్రియ మెరుగుపడినట్లు ఇంద్రాణిరుజువు చేసింది.

ఇండియానాకు చెందిన 18 ఏళ్ల అర్జున్‌ రమణి.. మూడో స్థానంలో నిలిచాడు. న్యూయార్క్‌కు చెందిన అర్చనా వర్మ (17)కు 90వేల డాలర్ల పురస్కారం దక్కింది. వర్జీనియాకు చెందిన ప్రతీక్‌ నాయుడు (18).. 70వేల డాలర్లను అందుకున్నాడు. ఫ్లోరిడాకు చెందిన వృందా మదన్‌ (17).. మలేరియా చికిత్సకు ఉపయోగపడే అవకాశమున్న 24 పదార్థాలపై అధ్యయనం సాగించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*