భారత్ లక్ష్యం 261 పరుగులు

indvsnz-newzealand-scores

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రాంచీలో జరుగుతున్న నాలుగో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. భారత పర్యటనలో తొలిసారి టాస్ గెలిచిన కివీస్ సారథి విలియమ్సన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు గుప్టిల్, లాథమ్ కివీస్‌కు శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ చక్కగా రాణించడంతో న్యూజిలాండ్ తొలి వికెట్‌కు 15.3 ఓవర్లలో 96 పరుగులు చేయగలిగింది. లాథమ్ (39) అవుటయ్యాక.. జట్టు స్కోరు 138 పరుగులకు చేరగానే గుప్టిల్ (72) కూడా పెవిలియన్ చేరాడు. తొలి పది ఓవర్లలో 80 పరుగులు చేసిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ తర్వాత నెమ్మదించారు. మరుసటి పది ఓవర్లలో కివీస్ జట్టు ఒక వికెట్ నష్టపోయి 36 పరుగులు మాత్రమే చేయగా, 30 ఓవర్లు వచ్చేసరికి న్యూజిలాండ్ మరో వికెట్ చేజార్చుకొని ఇంకో 45 పరుగులు మాత్రమే జత చేయగలిగింది. 40 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 199 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి ఐదు ఓవర్లలో కివీస్ బ్యాట్స్‌మెన్ ఫర్వాలేదనిపించడంతో ఆ జట్టు 260/7గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో కివీస్ కెప్టెన్ విలియమ్సన్ 41 పరుగులు చేయగా, రాస్ టేలర్ 35 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో అమిత్ మిశ్రా రెండు వికెట్లు పడగొట్టాడు. పాండ్య, అక్షర్, కులకర్ణి, ఉమేశ్ యాదవ్‌లకు తలో వికెట్ దక్కింది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకూ పది వికెట్లు పడగొట్టిన మిశ్రా.. ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్‌పై ఈ ఘనత సాధించిన తొలి స్పిన్నర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లలో మిశ్రా పది వికెట్లు తీయడం ఇది మూడోసారి. భారత స్పిన్నర్లలో హర్భజన్ కూడా మూడుసార్లు ఈ ఘనత సాధించాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*