సాయ్ పాలకమండలిలో జ్వాల

ప్రభుత్వ సలహాదారు పాపారావు, షూటర్ నారంగ్‌కూ చోటు
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్‌లో రెబల్‌గా ముద్రపడ్డ డబుల్స్ స్పెషలిస్టు గుత్తా జ్వాలకు భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్)లో పదవి దక్కింది. ఈ హైదరాబాదీ ఏస్ షట్లర్ సాయ్ పాలకమండలిలో సభ్యురాలిగా నియమితురాలైంది. ఈ మేరకు జ్వాల నియామకాన్ని ఖరారు చేస్తూ ఆమెకు సాయ్ కార్యదర్శి ఎస్‌ఎస్ ఛాబ్రా లేఖ పంపారు. సాయ్ పాలకమండలిలో సభ్యురాలిగా మీరు ఎంపికయ్యారని చెప్పేందుకు సంతోషిస్తున్నాం. సాయ్ చైర్మన్‌తో సమావేశానికి హాజరై భారత క్రీడారంగానికి సంబంధించిన అమూల్యమైన సూచనలను మీరు అందిస్తారని ఆశిస్తున్నాం అని జ్వాలకు పంపిన లేఖలో ఛాబ్రా పేర్కొన్నారు. జ్వాలతో పాటు హైదరాబాద్‌కే చెందిన స్టార్ షూటర్, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పాపారావులను కూడా సాయ్ పాలకమండలి సభ్యులుగా నియమించింది. మొత్తం 23మంది సభ్యులను పాలకమండలిలో సాయ్ నియమించింది. వీరిలో మాజీ అథ్లెట్లు అశ్వినీ నాచప్ప, షైనీ విల్సన్, మాజీ లిఫ్టర్ కుంజరాణీ దేవి, మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ ఉన్నారు. 14సార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచిన 33ఏండ్ల జ్వాల..రెండుసార్లు ఒలింపిక్స్‌కు ప్రాతినిథ్యం వహించింది. 2011 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అశ్వినీ పొన్నప్పతో కలిసి జ్వాల మహిళల డబుల్స్‌లో కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించింది. సాయ్ పాలకమండలిలో చోటు దక్కినందుకు సంతోషంగా ఉంది. క్రీడలకు ఏదైనా చేయాలని తపించే వాళ్లలో నేనెప్పుడూ ముందుంటాను. ఈ రూపంలో నాకు లభించిన అవకాశాన్ని కచ్చితంగా సద్వినియోగం చేసుకుంటాను. సాయ్ సభ్యురాలిగా ఈనెల 28న న్యూఢిల్లీలో జరిగే తొలి సమావేశంలో పాల్గొనబోతున్నాను. నా పదవికి సంబంధించిన బాధ్యతలేమిటన్నది ఆరోజు తెలుస్తుంది అని జ్వాల చెప్పింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన పాపారావు.. సాయ్‌లో పాలకవర్గ అధికారుల కమిటీలో సభ్యునిగా ఎంపికయ్యారు. గతంలో అసోం రా ష్ట్ర హోంశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన పాపారావు.. 1999 నుంచి పదేండ్లపాటు ఐక్యరాజ్యసమితిలోనూ పనిచేశారు. జ్వాల, గగన్, ప్రభుత్వ సలహాదారు పాపారావు సాయ్ సభ్యులుగా ఎంపికవడంపై సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*