రాష్ట్రంలో ఎక్కడ మద్యం కనిపించినా.. సీఎంను అరెస్టు చేయండి

ljp-disapproves-tough-penal-provisions-liquor-law-says-ram

బీహార్ లో ఎక్కడైనా మద్యం కనిపించినట్లుగా తెలిస్తే.. వెంటనే సీఎం నితీశ్ కుమార్ ను అరెస్టు చేయాలన్నారు కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్. సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం బీహార్ లో కొత్త చట్టాన్ని తెచ్చిన నేపథ్యంలో.. ఇక రాష్ట్రంలో ఎక్కడ మద్యం కనిపించినా నితీశ్ దే బాధ్యత అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే గతంలో ఇచ్చిన ఎన్నికల హామి మేరకు గత ఏప్రిల్ నెలలో నితీశ్ సర్కార్ మద్యపాన నిషేధం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చట్టాన్ని బీహార్ హైకోర్టు కొట్టేయడంతో.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం మెట్లెక్కిన నితీశ్ సర్కార్ కు ఊరట లభించింది. ఈ నేపథ్యంలోనే మద్యపానం చట్టంలో ఉన్న కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ రాం విలాస్ పాశ్వన్ పలు కామెంట్స్ చేశారు. ఇంట్లో మద్యం కనిపిస్తే.. ఆ కుటుంబంలోని పెద్దలందరినీ జైలుకు పంపించాలని చట్టంలో పేర్కొన్నారని, దాని ప్రకారం రాష్ట్రంలో ఎక్కడ మద్యం కనిపించినా.. నితీశ్ ను జైలుకు పంపించాలని ఎద్దేవా చేశారు. కాగా, రాష్ట్రంలో అమలులో ఉన్న మద్యపాన నిషేధానికి లోక్ జనశక్తి కూడా అనుకూలమేనని, అయితే మద్యపాన నిషేధ చట్టంలో కొత్తగా చేర్చిన కొన్ని నిబంధనలకు మాత్రం తాము వ్యతిరేకమని అన్నారు పాశ్వాన్. ముఖ్యంగా ఇంట్లో మద్యం కనిపిస్తే.. కుటుంబ పెద్దంలందరినీ అరెస్టు చేసే చట్టం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే, ఓ బాలికపై అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తోన్న ఎమ్మల్యే రాజ్ వల్లభ్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను కలవడాన్ని తప్పుబట్టారు పాశ్వాన్. బెయిల్ మీద బయటకొచ్చిన ఎమ్మెల్యేకు లాలూ మద్దతు పలకడం సరైంది కాదని, ఆయన్ను మళ్లీ జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి సుప్రీం కోర్టు న్యాయం చేస్తుందన్న భరోసా తమకుందన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*