జగనన్న ఇళ్ళ పంపకాల్లో అవకతవకలు జరుగుతున్నాయని, తమ పరిశీలనలో తేలిందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అదేశాల మేరకు ‘జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం పెద్ద వాల్తేర్, జాలారిపేట, ఆదర్శ గ్రామ వద్ద గల జగనన్న ఇళ్ళను ఆయన సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదర్శ గ్రామం వద్ద 120 జగనన్న ఇళ్లు నిర్మించారని తెలిపారు. ఇందులో 41 మంది అసలు లబ్ధిదారులుండగా, గతంలో ఇళ్లు పొందిన 72 మందికి మరల అక్రమ మార్గంలో కేటాయించారన్నారు. మిగిలిన 9 ఇళ్ళల్లో మంత్రి గుడివాడ అమర్నాథ్ సిఫార్సు మేరకు నలుగురికి, మిగిలిన 5 ఇళ్లు వైసీపీ నాయకులకు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇళ్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. వీటిపై సోషల్ ఆడిట్ చేయగా ఈ భాగోతం బయటపడిందని, పూర్తి స్థాయిలో విచారణ చేసి అర్హులైన లబ్ధిదారులకు జగనన్న ఇళ్లు కేటాయించాలని ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు. జగనన్న ఇళ్లు గూడు లేని పేదలకు అందించాలని తమ నేత పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్టు తెలిపారు. జగనన్న ఇళ్ళను సందర్శించిన వారిలో మూర్తి యాదవ్ తో పాటు జనసేన పార్టీ ఉత్తరాంధ్ర మహిళా కోఆర్డినేటర్ నాగలక్ష్మి, విశాఖ తూర్పు నియోజకవర్గం వీర మహిళ కళా, జనసేన పార్టీ నాయకులు భోగిల శ్రీనివాస్, పోతున ప్రసాద్, తదితరులు ఉన్నారు.
జగనన్న ఇళ్ళ పంపకాల్లో అవకతవకలు
