అమరావతి: దేశంలోని పలు రాష్ట్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ మంగళవారం పాక్షిక చంద్రగ్రహణం కనిపించింది. చంద్రగ్రహణంను ప్రజలు ఎంతో ఆసక్తిగా తిలకించారు. మంగళవారం మధ్యాహ్నం 2.39 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6.27 నిమిషాలకు ముగిసింది.
మంగళవారం సాయంత్రం 5.12 గంటల ప్రాంతంలో చంద్రగ్రహణం పూర్తిగా కనిపించింది. చీకటి పడేసరికి పాక్షిక గ్రహణంతో చంద్రుడు కనువిందు చేశాడు. రాష్ట్రంలోని కొన్ని నగరాల్లో గ్రహణం సంపూర్ణంగా కనిపించగా.. తిరుమలలో మాత్రం పాక్షికంగానే దర్శనమిచ్చింది.
చంద్ర గ్రహణం వీక్షించేందుకు ఎలాంటి పరికరాలు అవసరం లేదని చెప్పడంతో ప్రజలంతా నేరుగా చంద్ర గ్రహణాన్ని తిలకించారు. మరోవైపు, చంద్రగ్రహణం కారణంగా మూతబడిన ఆలయాలు తెరుచుకుంటున్నాయి. పలు ఆలయాలు భక్తులను అనుమతిస్తుండగా.. మరికొన్ని ఆలయాల్లో బుధవారం నుంచి అనుమతిస్తామని చెప్పారు.