తక్షణమే నిర్మాణ అనుమతుల్ని నిలిపేయాలి

 

సిరిపురం మెయిన్‌ రోడ్డులో ఉన్న కైలాసమెట్టలోని కాన్వేషన్‌ బాపిస్టు చర్చెస్‌ ఆఫ్‌ నార్తన్‌ సిరికార్స్‌ (సీబీసీఎన్‌సీ) స్థలంలో 18,390గజాల్ని నిబంధనలు ఉల్లంఘించి కేటాయించిన టీడీఆర్‌ను తక్షణమే రద్దు చేసి అందుకు కారకులైన అధికారులపై చర్యలు చేపట్టాలని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ జీవీఎంసీ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం మూర్తి యాదవ్‌ కమిషనర్‌తో పాటు మున్సిపల్‌ ప్రత్యేక కార్యదర్శికి కూడా లేఖ పంపించారు. 18,390 గజాల స్థలంలో ఎలాంటి రహదారి విస్తరణ జరగకుండానే టీడీఆర్‌ (అభివృద్ధి కొరకు బదిలీ చేయబడిన హక్కులు) కోసం దరఖాస్తు చేసేసుకున్నారని ఆయన ఆరోపించారు. జీవీఎంసీ టౌన్‌ సర్వే అధికారులు ఆ దరఖాస్తును కనీసం పరిశీలించకుండానే, ఎలాంటి సర్వే చేయుకుండానే 1800 గజాల స్థలం రహదారి విస్తరణ నిమిత్తం ఆ స్థలానికి బదులు టీడీఆర్‌ మంజూరు చేసేయొచ్చని తప్పుడు నివేదికలిచ్చేశారని మూర్తి యాదవ్‌ ఆరోపించారు. ఆ నివేదిక ప్రకారం సదరు చర్చికి చెందిన 18సంస్థలకు కాకుండా దినకర్‌ త్యాగరాజ్‌ అనే వ్యక్తి పేరిట 1800 గజాలకు నాలుగు రెట్లు అంటే సుమారు రూ. 62 కోట్ల విలువైన టీడీఆర్‌ (టీడీఆర్‌ నంబర్‌ 1086)ను మంజూరు చేయడం ఎంత వరకు సబబన్నారు.

వాస్తవాలివీ

ఈ టీడీఆర్‌కు సంబంధించి జీవీఎంసీ టౌన్‌ సర్వే/ప్లానింగ్‌ అధికారులు వుడా మాస్టర్‌ ప్లాన్‌ 2006ప్రకారం 45మీటర్ల రహరిదారి విస్తరణలో భాగంగా 1800 గజాల స్థలం పోతున్నట్టు..ఆ స్థలానికి టీడీఆర్‌ మంజూరు చేయవచ్చునని జీవీఎంసీ అధికారులిచ్చిన నివేదికలో ఉందని పేర్కొంటున్న అంశంపైనా పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని మూర్తి యాదవ్‌ తన లేఖలో పేర్కొన్నారు. టీడీఆర్‌ ఆదేశాల్లో వాస్తవాల్ని పరిశీలిస్తే అపెండిక్స్‌ నోటిఫికేషన్‌ మాత్రమే ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొన్నారని, ఆ విషయాన్ని కూడా 345/2006 ద్వారా ప్రభుత్వం పొందుపర్చిందని ఆయన స్పష్టం చేశారు. కానీ 345/2016లో బ్లాక్‌ నంబర్‌ 9, టౌన్‌ సర్వే నంబర్‌ 75-3, 4 పార్ట్‌ 75, డోర్‌ నంబర్‌ 10-1-7అనేది పొందుపర్చలేదని మూర్తి యాదవ్‌ స్పష్టం చేశారు. కానీ జీవీఎంసీ సిబ్బంది వుడా మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారమేనని పేర్కొంటూ ప్రభుత్వ జీవోలో లేని వాల్తేరులోని చర్చి ప్రాంతంలో 1800 గజాల స్థలం రహదారి విస్తరణలో పోతున్నట్టు పేర్కొన్నారని ఆరోపించారు. అందుకే ఆ స్థలానికి టీడీఆర్‌ మంజూరు చేయవచ్చునుని కూడా సిబ్బంది సిఫారుసు చేసేసి అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. సిబ్బంది సమర్పించిన నివేదిక ప్రకారమే సీబీసీఎన్‌సీ చర్చికి చెందిన 18 సంస్థలకు కాకుండా దినకర్‌ త్యాగరాజ్‌ అనే వ్యక్తి పేరిటే 1800 గజాలకు..నాలుగు రెట్లు అంటే సుమారు 7200గజాలకు రూ.62కోట్ల విలువైన టీడీఆర్‌ మంజూరు చేయించేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా జీవీఎంసీ సిబ్బంది సమర్పించిన టీడీఆర్‌పై కనీసం నామమాత్రంగానైనా అధికారులు దృష్టి సారించకుండానే నివేదిక ఆధారంగా టీడీఆర్‌ మంజూరు చేయించడంపై తమకు అనుమానాలున్నాయని స్పష్టం చేశారు.

కోర్టు వివాదాల్లో ఉంటుండగానే..

వాస్తవానికి ఈ స్థలానికి సంబంధించి కోర్టుల్లో కూడా వివాదాలు నడుస్తున్నాయి. వుడా మాస్టర్‌ ప్లాన్‌ 2006 ప్రకారం 1800గజాల స్థలం రహదారి విస్తరణలో పోతున్నట్టు నివేదిక ఇచ్చిన సమయానికి ప్రభుత్వ ఉత్తర్వు నంబర్‌ 345/2006 వుడా వీఎంఆర్‌-2021అన్నది అమల్లోనే లేదని మూర్తి యాదవ్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి విశాఖ మెట్రో పాలిటన్‌ ప్రాంత అభివృద్ధి సంస్థ`2041మాత్రమే మాస్టర్‌ ప్లాన్‌ అమల్లో ఉందని గుర్తు చేశారు. అంతేకాకుండా సీబీసీఎన్‌సీ చర్చి వ్యవహారాలపై న్యాయస్థానాల్లో వివిధ కేసులున్నాయని, ఆ భవన నిర్మణాలకు సంబంధించి ప్లాన్‌ అనుమతులకు అవసరమైన ఈసీ, స్థల డాక్యుమెంట్లు, యూఎల్‌సీ క్లియరెన్స్‌ వంటి డాక్యుమెంట్లు పూర్తిస్థాయిలో సమర్పించకపోయినా టీడీఆర్‌ ఇచ్చేశారని పేర్కొన్నారు. వాస్తవాలు పరిశీలించకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న స్థలాలకు టీడీఆర్‌లు మంజూరు చేయకూడదనే వాస్తవాల్ని సైతం జీవీఎంసీ సిబ్బంది మర్చిపోయారని మూర్తి యాదవ్‌ పేర్కొన్నారు. దీంతో కోట్లాది రూపాయిలు చేతులు మారినట్టు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అందువల్ల సీబీసీఎన్‌సీ చర్చికి సంబంధించి దినకర్‌ త్యాగరాజ్‌ అనే వ్యక్తి పేరిట 1800 గజాలకు నాలుగు రెట్లు అంటే సుమారు రూ.62 కోట్ల విలువైన టీడీఆర్‌ను తక్షణమే రద్దు చేయించి, టీడీఆర్‌ మంజూరుకు కారణమైన అధికారులు, సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మూర్తి యాదవ్‌ డిమాండ్‌ చేశారు. సదరు కాపీల్ని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక కార్యదర్శికి కూడా పంపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *