నా అభ్యర్ధన మేరకే సభ జరిగింది

ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన విజయవంతం అయిందని,  వ్యక్తిగతంగా తన అభ్యర్థన మేరకే విశాఖలో సభ జరిగిందని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. లాసన్స్ బే కాలనీలో గల బీజేపీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనేక ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపనలు జరగటం రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఇస్తున్న సహకారానికి నిదర్శనం అని అన్నారు. ప్రధాని పర్యటనలో రైల్వే జోన్ ఉంటుందా లేదా వంటి చర్చలు సాగాయని,  ప్రధాని పర్యటనకు ఒక రోజు ముందే ఈనెల 10న జోన్ నిర్ధారిస్తూ నోటిఫికేషన్ వెలువడిందని అన్నారు. రాయగడ జోన్, సౌత్ కోస్ట్ జోన్లకు 106 కోట్లు మంజూరు చేశారన్నారు. కనుక దీని మీద విమర్శలు నిర్హేతుకమని అన్నారు. రైల్వే మంత్రి జోన్ ప్రధాన‌ కార్యాలయం ఎక్కడ నిర్మించాలో తనిఖీ చేశారని తెలిపారు. నిర్మాణ ప్రక్రియ త్వరలోనే మొదలవుతుందని, నేషనల్ ఇంటర్నెట్ ఎక్సేంజ్ ఆఫ్ ఇండియా ఎనిమిది సెంటర్లలో ఒకటి విశాఖకు దక్కిందని అన్నారు. ఇది నెట్ కల్పనకు ఇది అత్యవసరమని, రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవే ఈ శాఖ చూస్తున్నారని తెలిపారు. మరో మూడు నెలల్లో ఇది విశాఖలో సాకారం అవుతుందని అన్నారు. ఐటి పరిశ్రమ అభివృద్ధికి ఇది ఊపునిస్తుందని అన్నారు. ఇంటర్నెట్ సేవలు ఫాస్ట్ ట్రాక్ లో అందుతాయని అన్నారు. ప్రధా‌ని పర్యటన సందర్భంగా బిజెపి కోర్ కమిటీతో గంటన్నర చర్చించారని అన్నారు. అదే రాత్రి ప్రెస్ మీట్లో ఆ వివరాలు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారని అన్నారు. కోర్ కమిటీ సమావేశంలో జరిగిన విషయాలు బయటకు చెప్పం కానీ కొన్ని మీడియాలు అక్కడ ఏదేదో జరిగిందని కొందర్ని టార్గెట్ చేస్తూ అసత్యాలు రాశారని అన్నారు. రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి దోహద పడేలా ప్రధాని యాత్ర సాగిందని, శోభా యాత్ర మీద పోలీసులు అనేక ఆక్షలు విధించినా అది విజయవంతం అయిందని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షుడు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *