ఒకప్పుడు ఋషులు తపస్సు చేసుకునే రుషికొండను ఏపీ టూరిజం పేరుతో కబ్జా చేస్తున్నారని, దసపల్లా భూములపై సిబిఐ విచారణ జరపాలన్న మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎందుకు నోరు మెదపడం లేదని, వీటిపై ప్రకటన విడుదల చేయాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం హోటల్ మేఘాలయలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిడిపి నాయకులు, బిజెపి నాయకులు జివిఎల్ నరసింహారావు, సిపిఐ నాయకులు జేవి సత్యనారాయణ రుషికొండ వద్దకు వెళ్తే అరెస్ట్ చేస్తున్నారని, ఇదెక్కడి న్యాయమని నిలదీశారు. రుషికొండపై ఏపి టూరిజం రీ డెవలప్మెంట్ ప్లాన్ పేరుతో
మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ నుంచి
9.88 ఎకరాలే తీసుకున్నారని, కానీ ఏపి టూరిజం హైకోర్టులో ప్రభుత్వానికి 3.8 ఎకరాలు అదనంగా తవ్వామని అఫిడవిట్ ధాఖలు చేశారని ఆయన వెల్లడించారు. అయితే రుషికొండలో కొత్త భవనాల నిర్మాణానికి 2.78 ఎకరాల్లోనే నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకుని, అనుమతులకు మించి కొండను తవ్వుతున్నారన్నదే తమ అభ్యంతరమని ఆయన స్పష్టం చేశారు. నిర్మాణాలు జరుగుతున్న భవనాల ముందు ప్లాన్ నమూనా ప్రదర్శిస్తారని, జివిఎమ్సీ నుంచి అనుమతులు తీసుకున్న రుషికొండ నిర్మాణాలకు ప్లాన్ నమూనాను ఎందుకు ప్రదర్శించడం లేదని ప్రశ్నించారు. రుషికొండను జనసేన అధినేత
పవన్ కల్యాణ్ సందర్శిస్తే జగన్ పార్టీకి ఉలుకెందుకన్నారు. ప్రభుత్వ సంపద రుషికొండ కోసం న్యాయపోరాటం చేస్తున్నామని వివరణ ఇచ్చారు. పవన్ కల్యాణ్ తో ఫోటో దిగేందుకు అమర్ ఏళ్ల తరబడి ఎదురుచూడలేదా అన్నారు. తాడేపల్లి నుంచి వచ్చిన స్క్రిప్ట్ ఏడు పేజీల కాపీని మంత్రులు మీడియా ముందు చదువుతున్నారని, ఆ కాపీని ఆయన విలేకరులకు చూపించారు. జగనన్న ఇళ్లలో బినామీలను పెట్టి పేదలను మోసం చేస్తున్నారని, ఇందులో రూ.17 వేల కోట్ల కుంభకోణం జరుగుతోందన్నారు. కేంద్ర ఇళ్ల పథకానికి ఏపి వాటాగా ఒక్కో లబ్దిదారుకు రూ.లక్ష యాభై వేలు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 30 వేల రూపాయలు కూడా ఇవ్వకుండా తత్సారం చేస్తున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ కు ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. జగన్ లాగా ఈడీ , సిబిఐ కేసుల మాఫీకోసం కేంద్రాన్ని మంచి చేసుకోవాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. ఢిల్లీ పెద్దల వద్ద మోకాళ్లపై పడే పరిస్ధితి పవన్ కల్యాణ్ కు ఎప్పటికీ రాదన్నారు. అనకాపల్లి, బయ్యవరంలో 400 ఎకరాల రైతుల భూములను ఆక్రమించి మంత్రి అమర్నాథ్ లేఅవుట్లు వేయలేదా అని ప్రశ్నించారు.
మాకవరంపాలెంలో 11 ఎకరాల గ్రానైట్ క్వారీని అమర్, తన సోదరుడు పేరుమీద మైనింగ్ చేయడం వాస్తవం కాదా అన్నారు. వెస్ట్ సబ్ డివిజన్ లో అక్టోబర్ 30 వరకూ మాత్రమే సెక్షన్ 30 అమల్లో వుందని, ప్రస్తుతం లేదని తెలిపారు. రుషికొండపై అక్రమాలు జరుగుతోంటే చూస్తూ ఊరుకోవాలా అంటూ, ప్రభుత్వ ఆస్తి రుషికొండను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. సిఆర్జెడ్ వైలేషన్స్ ను పవన్ స్వయంగా చూశారని, చివరకు రుషికొండ బీచ్ ను ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్ట్ ఇవ్వడానికి సిద్దమవుతున్నారని తెలిపారు. ఇండియాలో రుసుకొండకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ ఉందని, అటువంటి రుషికొండ బీచ్ ను ఎలా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడతారని ఆయన మండిపడ్డారు. వ్యక్తిగతంగా ఆర్థికంగా వైసిపి నేతలు బలపడుతున్నారని, అటువంటివారా తమ నేతపై విమర్శలు చేసేదన్నారు. పవన్ కళ్యాణ్ ను విమర్శించే నైతిక హక్కు వైసిపి నేతలకు లేదని, రానున్న రోజుల్లో వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జనసేన రీజనల్ కోఆర్డినేటర్ ఎం నాగలక్ష్మి, జనసేన నాయకులు శ్రీనివాస్ పట్నాయక్, దుర్గా, రూప, కళ, త్రివేణి, తదితరులు పాల్గొన్నారు.
రుషికొండ, దసపల్లా భూముల కబ్జాపై మంత్రి అమర్నాథ్ ప్రకటన చేయాలి –
