అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత కాపు రామచంద్రారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన పార్టీ అధ్యక్షుడు జగన్‌కు లేఖ రాశారు. తమ కుటుంబంలో ఇటీవల జరిగిన విషాద సంఘటనతో పాటు నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలపై పూర్తిగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందననారు. దీనివల్ల తాను జిల్లా అధ్యక్ష పదవిని నిర్వహించలేకపోతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తనకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి జగన్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన విజ్ఞప్తి మన్నించాలని, రాజీనామాను ఆమోదించాలని కోరారు.
ఈ ఏడాది ఆగస్టులో కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథ్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని ఇంట్లో ఆయన ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేకెత్తించింది. అన్నమయ్య జిల్లాలోని రామాపురం మండలం పప్పిరెడ్డిగారిపల్లె మంజునాథ్ రెడ్డి స్వగ్రామం. ఆయన తండ్రి మహేశ్వర్ రెడ్డి కూడా వైసీపీలో ఉన్నారు. మంజునాథ్ భార్య, కాపు రామచంద్రారెడ్డి కుమార్తె స్రవంతి డాక్టర్‌గా పనిచేస్తున్నారు
రాయదుర్గం ఎమ్మెల్యేగా ఉన్న కాపు రామచంద్రారెడ్డి తన కుటుంబంలో జరిగిన విషాద సంఘటనపై కలవరానికి గురయ్యారు. ఎన్నికలు కూడా సమీపిస్తుండటంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలతోపాటు ఎమ్మెల్యేగా పోటీచేయాల్సి ఉండటంతో.. రెండింటికీ న్యాయం చేయలేనని భావించి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.