సి.బి.సి.ఎన్.సి. టిడిఆర్ రద్దుచేసి, చర్యలు తీసుకోండి -కమిషనర్ ను కోరిన పీతల మూర్తి యాదవ్

క్రిస్టియన్ మైనార్టీకి చెందిన సిబిసిఎన్సి స్థలం టిడిఆర్ రద్దుచేసి, అడ్డగోలుగా టి డి ఆర్ ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని 22వ వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఆయన జీవీఎంసీ కమిషనర్ పీ రాజబాబు, మేయర్ హరి వెంకట కుమారిలకు సి బి సి ఎన్ సి స్థల బాగోతంపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సిరిపురం సమీపంలోని సుమారు రూ.500 కోట్ల విలువగల క్రిస్టియన్ మైనార్టీలకు చెందిన స్థలాన్ని కబ్జా చేయడానికి ఎంపీ ఎంవీవి సత్యనారాయణ, స్మార్ట్ వైజాగ్ సిటీ మాజీ చైర్మన్ జీవి కలిసి పథకం వేసారని ఆరోపించారు. గత కొన్ని ఏళ్లుగా ఈ స్థల వివాదం హైకోర్టులో నడుస్తుందని, దీనిపై ఎనిమిది కేసులు కోర్టులో పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఇవన్నీ దాచేసి18 సంస్థల క్రిస్టియన్ మిషనరీకి చెందిన 18,390 గజాల సీబీసీఎన్సి స్థలాన్ని ఆదిత్య పవన్ డెవలపర్స్ కు డెవలప్మెంట్ నిమిత్తం ప్లాన్ మంజూరు ఎలా చేశారని ప్రశ్నించారు. ప్లాన్ అనుమతులకు అవసరమైన ఈసి, స్థల డాక్యుమెంట్లు, గతంలో యూఎల్ సి క్లియరెన్స్ వంటి డాక్యుమెంట్లు పూర్తి స్థాయిలో సమర్పించక పోయినా, టౌన్ ప్లానింగ్ అధికారులు బి ఏ నెంబర్ కేటాయించినట్టు తెలిపారు. ప్లాన్ అనుమతుల కొరకు 18,390 గజాల స్థలానికి వి ఎల్ టి కింద సుమారు రూ.2.56 కోట్లు జీవీఎంసీకి పన్నులు చెల్లించాలని, ఈ మొత్తాన్ని చెల్లించకుండా ఉండేందుకు జీవీఎంసీ రెవిన్యూ అధికారులు ఖాళీ స్థలంలో అక్రమంగా 18 ఎస్సేస్మెంట్ నంబర్లు కేటాయించి, సదరు డెవలపర్లకు కోట్ల రూపాయల ప్రయోజనం చేకూర్చారని ఆరోపించారు. ఇంత పెద్ద మొత్తంలో జీవీఎంసీ ఆదాయానికి నష్టం కలిగించిన సంబంధిత రెవిన్యూ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని విధుల నుంచి తప్పించాలని కోరారు. సర్వే అధికారుల నివేదిక ప్రకారం టౌన్ ప్లానింగ్ అధికారులు దినకర్ త్యాగరాజ్ పేరుతో 1800 గజాలకు నాలుగు రెట్లు అంటే సుమారు రూ. 62 కోట్ల విలువగల టీడిఆర్ సమర్పించారన్నారు. 2006లో మాస్టర్ ప్లాన్ లో జీవీఎంసీ రోడ్ల నిర్మాణంలో స్థలాలు పోగొట్టుకున్న వారికి, బి ఆర్ టి ఎస్ రోడ్లు వేసేటప్పుడు స్థలాలు కోల్పోయిన వారికి నేటి వరకు టిడిఆర్లు ఇవ్వలేదని, సి బి సి ఎన్ సి స్థలంలో టీడిఆర్ లు కేవలం 18 రోజుల వ్యవధిలో దినకర్ త్యాగరాజ్ కు నాలుగు రెట్లు అధికంగా రూ.62కోట్ల విలువైన టీడిఆర్ ఇచ్చేసారన్నారు. తణుకులో 350 కోట్ల టిడిఆర్ స్కాం జరిగిందని, దీంతో తణుకు మున్సిపాలిటీ బ్లాక్ లిస్టులో పెట్టిందని, కొంతమంది అధికారులను వైసీపీ నేతలు బలి చేశారని గుర్తు చేశారు. కాబట్టి సి బి సి ఎన్ సి స్థలానికి అనుమతులు, బీ ఏ నెంబర్ రద్దుచేసి, టి డి ఆర్ లు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని మేయర్, కమిషనర్ ను కోరినట్టు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జనసేన నేత శ్రీనివాస్ పట్నాయక్ కూడా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *