సోషల్ వెల్ఫేర్ కు కేటాయించిన 3,500 గజాల స్థలం కబ్జా!

సోషల్ వెల్ఫేర్ కు ప్రభుత్వం కేటాయించిన 3,500 గజాల స్థలం కబ్జా ముఖ్యమంత్రికి తెలియకుండా జరుగుతుందా అంటూ….. హైకోర్టు, జిల్లా కోర్టులలో సి బి సి ఎన్ సి స్థల వివాదం నడుస్తుండగా ఏ విధంగా ప్లాన్, టి డి ఆర్ ఇస్తారని 22వ వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ జివిఎంసి అధికారులను ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం ఉదయం నగరంలోని హోటల్ మేఘాలయ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రూ.500 కోట్ల విలువైన సి బి సి ఎన్ సి స్థలం కబ్జా ముఖ్యమంత్రికి తెలియకుండా జరుగుతుందా అని నిలదీశారు. దేవుని దయవల్ల పరిపాలన చేస్తున్నానని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అదే దేవుని స్థలాలు వైసీపీ నేతలు కబ్జా చేస్తుంటే ఏం చేస్తున్నారన్నారు. సి బి సి ఎన్ సి ముసుగులో ఆ స్థలాన్ని ఎంపీ ఎంవీవి సత్యనారాయణ, స్మార్ట్ సిటీ మాజీ చైర్మన్ జీవి కలిసి కాజేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సర్వేనెంబర్ 75లోని సి బి సి ఎన్ సి స్థలాన్ని ఐదు సబ్ డివిజన్లగా విభజించారని తెలిపారు. సర్వే నంబర్ 75/1లో చర్చి ఉందని, 75/2లో స్థలం రోడ్డులో పోయిందని, 75/3లో సి బి సి ఎన్ సి ముసుగులో 18,390 గజాల స్థలంగా నిర్ధారించారు. అలాగే 75/4లో గతంలో బాలికల హాస్టల్ ఉండేదని, ఆ స్థలం సోషల్ వెల్ఫేర్ కు చెందినదని, 3వేల 500 గజాల స్థలం కేటాయించారని ఆయన తెలిపారు. సర్వేనెంబర్ 75 లోని నాలుగు సబ్ డివిజన్లు కలిపి రిజిస్ట్రేషన్ చేశారని, అది ఎలా అవుతుందన్నారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఎక్కడ నిర్మాణాలు చేపట్టిన కాలువలు, గెడ్డలు కబ్జా చేస్తుంటారని, కూర్మన్నపాలెంలోని ఏలేరు కాలువ కబ్జా ఇందుకు నిదర్శనం అన్నారు. సి బి సి ఎన్ సి స్థలంపై ఆరు పిటిషన్లు కోర్టులో ఉన్నాయని, 18 సంస్థలకు చెందినట్టుగా చెపుతున్న ఈ స్థలంపై 26 మందిపై హైకోర్టులో నళిని త్యాగరాజన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, ఇది పెండింగ్లో ఉందని ఆయన తెలిపారు. మిగిలిన పిటిషన్లలో ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, జీవీఎంసీ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారని ఆయన వెల్లడించారు. ఈ స్థలం కబ్జాపై జీవీఎంసీ కమిషనర్ రాజబాబును కలిసి ఫిర్యాదు చేసి, గంటకుపైగా వివరించానని, కోర్టులో ఉండగా ఎలా ప్లాన్, టి డి ఆర్ ఇస్తారని అతనిని ప్రశ్నించినట్టు మూర్తి వెల్లడించారు. కమిషనర్ రాజబాబుకు ఫిర్యాదు చేసి వారం రోజులు దాటిన చర్యలు లేవన్నారు. పైగా వాస్తవాలు బయటపెట్టిన ఓ దినపత్రికకు, ఎటువంటి వివాదాలు లేవని రిజేండర్ ఇచ్చారని తెలిపారు. గతంలో పనిచేసిన కమిషనర్ లక్ష్మిశా వైసిపి నేతల కబ్జాకు సహకరించడం లేదని అతనిని బదిలీ చేసి, తమకు అనుకూలమైన కమిషనర్ను నియమించుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని క్రైస్తవ చర్చిల అభ్యున్నతికి రూ.170 కోట్లు శాంక్షన్ చేశామని ముఖ్యమంత్రి జగన్ చెబుతూ, మరోపక్క క్రైస్తవ స్థలాలను ఎంపీలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే ఋషికొండ, హాయగ్రీవ, దసపల్లా భూములను కబ్జా చేస్తున్నారని, ఇప్పుడు క్రైస్తవ స్థలాలను కూడా వదలడం లేదన్నారు. తన దగ్గర తప్పుడు ఆధారాలు ఉన్నాయి అంటూ ప్రచారం చేస్తున్నారని, నిరూపిస్తే ఏ శిక్ష కైనా తాను సిద్ధమని మూర్తి ప్రకటించారు. సి బి సి ఎన్ సి స్థలానికి ఇచ్చిన ప్లాన్, టి డి ఆర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో క్రైస్తవ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు జనసేన పార్టీ ఉద్యమిస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు శ్రీనివాస్ పట్నాయక్, పి శ్రీనివాస్, శివ, నాగలక్ష్మి, రూప, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *