ఎవరైనా తప్పు చేస్తే వదిలిపెట్టను

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జెఎన్‌టియుకె మైదానంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ధర్మ పోరాట దీక్ష బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.  ఎన్నికల ముందు స్విస్‌ బ్యాంక్‌ నుంచి డబ్బు తీసుకొచ్చి పేదల అకౌంట్‌లో రూ.15 లక్షలు వేస్తానని చెప్పిన మోడీ రూ.15 కూడా ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. మోడీ పాలనలో రూపాయి పతనమవుతోందని చెప్పారు.ఎవరైనా తప్పు చేస్తే వదిలిపెట్టనని, అవినీతి పట్ల చండశాసనుడిలా ఉంటానని  చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్రం సహకరించకపోవడం వల్ల రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. కేంద్రంపై ఆధారపడి ఉంటే రాష్ట్రం బీహార్‌లా తయారై ఉండేదని విమర్శించారు. దేశంలో వ్యవసాయాభివృద్ధి రెండుశాతం కూడా లేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదన్నారు. స్వామినాధన్‌ కమిటీ సిఫార్సులను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. భూమి, నీరు అన్ని వసతులు కల్పిస్తామని చెప్పినప్పటికీ, కడపలో ఉక్కు ఫ్యాక్టరీని పెట్టలేమని చెప్పడం సరికాదన్నారు. గాలి జనార్థనరెడ్డి ఉక్కు ఫ్యాక్టరీ పెడతాననడం సరికాదని అన్నారు.  విశాఖ రైల్వే జోన్‌ ఇవ్వకుండా బిజెపి తమాషా చేస్తోందన్నారు. అమరావతి రాజధాని నిర్మాణమైతే ఆదాయం ఢిల్లీకే వస్తుందని, అయినప్పటికీ కేంద్రం సహకరించడం లేదన్నారు. జాతీయ విద్యాసంస్థలను ఏర్పాటు చేయడంలో కేంద్రం వెనుకడుగు వేస్తోందన్నారు. నేటికి రూ.11,600 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, రూ.6,662 కోట్లు ఇచ్చిందన్నారు. గిరిజన యూనివర్సిటీని విజయనగరంలో ఏర్పాటు చేయాలన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు గతంలో మంజూరు చేసి వెనక్కి తీసుకున్న రూ.350 కోట్లను తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*