రాజకీయాల్లోకి బ్రాహ్మణి

nara-brahmini-political-entry

త్వరలో చేపట్టబోయే కేబినెట్ విస్తరణలో లోకేష్ కు అవకాశమిస్తారా? లేదా? అన్న చర్చ ఓవైపు కొనసాగుతుండగానే.. లోకేష్ భార్య, సీఎం చంద్రబాబు కోడలు బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీకి కసరత్తులు మొదలయ్యాయన్న ఊహాగానాలు ప్రస్తుతం తెరమీద ఊగిసలాడుతున్నాయి. కాలిఫోర్నియాలోని శాంతాక్లారా యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ లో అత్యుత్తమ గ్రేడ్ సాధించిన బ్రాహ్మణి.. ఆ తర్వాత ప్రఖ్యాత స్టాన్ వర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసి ప్రస్తుతం హెరిటేజ్ సంస్థ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇటీవలే.. పార్టీ వర్గాలకు సైతం తెలియకుండా బ్రాహ్మణి ఓ పొలిటికల్ సర్వే కూడా నిర్వహించారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. బ్రాహ్మణికి రాజకీయాల పట్ల ఉన్న ఆసక్తిని గమనించిన చంద్రబాబు ఆమెను జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ చేయాలనే యోచనలో ఉన్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో బ్రాహ్మణిని లోక్‌సభకు పంపించడం ద్వారా ఆమెను జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ చేయాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారన్న వాదన వినిపిస్తోంది. దీన్నిబట్టి టీడీపీ తరుపున భవిష్యత్తు రాజకీయాల్లో.. బ్రాహ్మణి జాతీయ రాజకీయాల్లోను, లోకేష్ రాష్ట్ర రాజకీయాల్లోను చక్రం తిప్పేలా చంద్రబాబు అంతర్గతంగా ప్లాన్స్ సిద్దం చేసుకుంటున్నారన్న వాదన కూడా లేకపోలేదు. విషయ పరిజ్ఞానంతో పాటు ఆకట్టుకునే మాట తీరు.. ఎన్టీఆర్ ట్రస్టు తరుపున బ్రాహ్మణి చేపడుతోన్న కార్యక్రమాలు.. ఇవన్నీ చూసి బ్రాహ్మణి రాజకీయాల్లోను రాణించగలదన్న నమ్మకం చంద్రబాబుకు ఏర్పడిందని చెబుతున్నారు. బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ నిజమే అయితే.. ఎక్కడి నుంచి పోటీ..? బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ కోసం ఇప్పటికే కసరత్తులు ప్రారంభమయ్యాయన్న ఊహాగానాల నేపథ్యంలో.. భవిష్యత్తులో ఆమె పోటీ చేయబోయే స్థానాలను కూడా చంద్రబాబు ఇప్పటికే ఖరారు చేశారని తెలుస్తోంది. టీడీపీకి కంచుకోటలైన గుంటూరు, హిందూపురంలలో ఏదో ఒక స్థానం నుంచి బ్రాహ్మణిని లోక్ సభకు పంపించాలని చంద్రబాబు భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ రెండు స్థానాల్లో ఎక్కడినుంచి పోటీ చేసినా..! గెలుపుపై బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదనేది చంద్రబాబు ఆలోచనగా చెప్పుకుంటున్నారు. ఏదేమైనా బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీతో.. చంద్రబాబు కుటుంబ రాజకీయాలు మరింత బలోపేతం కావడం మాత్రం ఖాయం. అయితే ఇదంతా వార్తలకే పరిమితమవుతుందా..? లేక నిజంగానే భవిష్యత్తులో బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ జరగబోతుందా? అన్నది రానున్న రోజుల్లో తేలిపోనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*