ఫుడ్ పార్కును అక్కణ్నించి తరలించాల్సిందే!

pawan-kalyan-speech-on-mega-aqua-food-park

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్మిస్తున్న మెగా ఆక్వాఫుడ్ పార్కును వెంటనే నిలిపేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఆక్వాఫుడ్ పార్కును వ్యతిరేకిస్తున్న రైతులంతా హైదరాబాద్ వచ్చి తమ గోడును పవన్ దగ్గర వెళ్లబోసుకున్నారు. వారితో పాటూ కలిసి పవన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో పవన్ మాట్లాడారు. రెండేళ్లుగా రైతులు ఆక్వాఫుడ్ పార్కును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా… నాయకులెవరూ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వందల గడపలున్న గ్రామాల్లో కొన్ని రోజులుగా 144 సెక్షన్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని అన్నారు. అభివృద్ధి పేరుతో అన్నం పెట్టే భూముల్ని లాక్కోవడం మంచిది కాదన్నారు. సాగుకు ఉపయోగపడని భూముల్నే పరిశ్రమలకు ఇవ్వాలని… పంటలు పండే భూమిని ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. గంగానది విషతుల్యమై పోయిందని, గోదావరిని కూడా విషతుల్యం చేస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అక్కడి గ్రామాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని… ఈ పార్కు నిర్మాణాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తే గ్రామాలు మరో నందిగ్రామ్ లా మారే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అలా కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. నిజానికి తాను భీమవరంలోనే మీటింగ్ పెడదామనుకున్నానని… దీని వల్ల కొన్ని సమస్యలు వస్తాయన్న ఆలోచనతో ఇక్కడే మీడియాతో మాట్లాడుతున్నానని తెలిపారు. ఈ పార్కును ఊరి మధ్యలోంచి తీసేసి, సముద్ర తీర ప్రాంతాల్లో పెట్టాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నట్టు చెప్పారు. ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ సమస్యపై లోతుగా అధ్యయనం చేయాలని కోరారు.బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు ఫుడ్ పార్కు విషయంలో రైతులను అస్సలు పట్టించుకోవడం లేదని అన్నారు. ఆయన గోదావరిని కలుషితం చేసేందుకు కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోందన్నారు. ఆక్వా ఫుడ్ పార్కు తరలింపు విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తే మాత్రం ఊరుకోనని… పోరాటం చేస్తానని తెలిపారు. తనతో కలిసొచ్చే పార్టీలతో జతకట్టి శాంతియుతంగా పోరాటం చేస్తానని తెలిపారు. రైతులకు జనసేన అండగా ఉంటుందని, ఎలాంటి సాయమైన చేస్తుందని హామీ ఇచ్చారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*