అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవాలి: పవన్‌

విజయవాడ: అగ్రిగోల్డ్‌ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. అగ్రిగోల్డ్‌ బాధితులతో మాట్లాడేందుకు ఈరోజు ఆయన విజయవాడ వచ్చారు. గేట్‌వే హోటల్‌లో మీడియాతో మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్‌ సమస్య లక్షలాది మంది ఖాతాదారుల జీవితాలతో ముడిపడి ఉందన్నారు. అగ్రిగోల్డ్‌కు వేల ఎకరాల ఆస్తులు, రూ.కోట్ల డిపాజిట్లు ఉన్నాయని… ప్రభుత్వం పారదర్శకంగా, చిత్తశుద్ధితో బాధితులకు న్యాయం చేయాలన్నారు.‘ అగ్రిగోల్డ్‌ ఆర్థిక నేరం ఓ చిక్కుముడి లాంటిది. దీన్ని జాగ్రత్తగా పరిష్కరించాలే తప్ప డెడ్‌లైన్లు విధించడం సరైంది కాదు. ఈ కుంభకోణంలో ప్రభుత్వంలోని వ్యక్తులపైనా ఆరోపణలే వినిపిస్తున్నాయి. వాటి గురించి లోతుగా తెలుసుకోవాలి. ఒకరు చెబితే నేను ఆరోపణ చేయడం తప్పు. ఇలాంటి ఆర్థిక నేరాలు జరిగినప్పుడు ప్రభుత్వమే బాధితులను ఆదుకునేందుకు కొంత పరిహారం అందించిన ఉదంతాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి. బాధితులకు ఎలా న్యాయం చేస్తారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని పవన్‌ డిమాండ్‌ చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*