తుది శ్వాస వరకూ జనం కోసమే

‘నా తుది శ్వాస వరకూ జనం కోసమే పోరాటం చేస్తాను. జనంతోనే ఉంటాను. అధికార దాహంతో రాజకీయాల్లోకి రాలేదు. అధికార, ప్రతిపక్ష పార్టీల్లాగా డబ్బులిచ్చి సమావేశాలకు జనాలను తరలించాల్సిన అవసరం జనసేనకు లేదు.. రాదు.. ఇక్కడకు వచ్చిన వారంతా స్వచ్చంధంగా ప్రేమతో వస్తారు. డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తులు కాదు జనసైనికులు’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర వెన‌కబ‌డిన ప్రాంతం కాదని, వెనక్కి నెట్టేసిన ప్రాంతమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్త‌రాంధ్ర యాస, భాష‌, క‌ళ‌ల‌తో పాటు ఆత్మ‌ను అర్థం చేసుకున్న ఏకైక పార్టీ జ‌న‌సేన మాత్రమేనని చెప్పారు. ఈ ప్రాంత స్వ‌రూపాన్ని, స్వ‌భావాన్ని అర్థం చేసుకున్న స్థానిక నాయ‌కుల‌కే జ‌న‌సేన పెద్ద‌పీట వేస్తుందని స్పష్టం చేశారు. పవన్‌ కళ్యాణ్‌ గురువారం మధ్యాహ్నం పోర్టు ఏరియాను సందర్శించారు. నిత్యం కాలుష్య కోరల్లో చిక్కుకున్న వన్‌ టౌన్‌, వెంకటేశ్వరస్వామి దేవాలయం, బొగ్గు డంపింగ్‌ యార్డులను పరిశీలించారు. కాలుష్యానికి గల కారణాలు, దీని వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనం తరం ముడసర్లోవ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. రిజర్వాయర్‌కు నీరొచ్చే మార్గం గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వనరులను కాపాడుకోవాలసిన బాధ్యత ప్రభుత్వంతోపాటు ప్రజలకు కూడా ఉందని పవన్‌ పేర్కొన్నారు.పవన్‌కళ్యాణ్‌ సమక్షంలో వివిధ పార్టీల నాయకులూ, పలువురు ప్రము ఖులు గురువారం జనసేన పార్టీలో చేరారు. భారీ సంఖ్యలో వారి అనుచరు లతో పవన్‌ బస చేసిన రిసార్ట్స్‌కు చేరు కుని జనసేనలో చేరారు. గాజువాకకు చెందిన బీసీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ కోన తాతారావు, అనకాపల్లికి చెందిన వ్యాపారవేత్త కొణతాల సీతారాం, ప్రముఖ క్రికెటర్‌ వై.వేణుగోపాలరావు, విశాఖ నగరానికి చెందిన బాలాజీ స్కూల్స్‌ అధినేత మండవ రవి కుమార్‌, పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన రామచంద్ర రావు తమ అనుచరులతో పార్టీలో చేరారు. వీరికి జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ జనసేన కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతి ఒక్క నాయకుడు కనీసం 500 మందితో పార్టీలో కలిశారు. అనకాపల్లికి చెందిన వ్యాపారవేత్త కొణతాల సీతారాం ఆ ప్రాంతం నుంచి రిసార్ట్స్‌ వరకూ 60 కార్లతో ర్యాలీగా వచ్చి జనసేనలో చేరారు. విజయనగరానికి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే మీసాల గీత సోదరుడు గురాన అయ్య కూడా పవన్‌ కలిసి మాట్లాడారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*