డిజిటల్ నవభారతం!

న్యూఢిల్లీ : నవ భారత నిర్మాణానికి పెద్ద నోట్ల రద్దు నిర్ణయం.. అతి పెద్ద ముందడుగు అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. డిజిటల్ చెల్లింపులతో సరికొత్త భారతావని నిర్మాణం జరుగుతుందని.. డిజిటల్ చెల్లింపులను దేశసేవగా పరిగణించాలని కోరారు. గతంలో ఇచ్చిన మేకిన్ ఇండియా నినాదం దేశాన్ని సరికొత్త దిశగా తీసుకెళ్లేందుకు తోడ్పడిందని.. ఇప్పుడు నవ భారతం నినాదం కూడా అదేస్థాయిలో సంచలనాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. రేడియో కార్యక్రమమైన మన్‌కీ బాత్‌లో ఆదివారం నరేంద్రమోదీ మాట్లాడుతూ దేశ ప్రజలు డిజిటల్ చెల్లింపులపై ఎక్కువగా దృష్టి సారించాలని కోరారు. నగదు చెల్లింపుల వల్ల నల్లధనానికి ఆస్కారం ఇవ్వడంతోపాటు పన్ను కట్టకుండా మోసాలు జరుగుతున్నాయని ఇవన్నీ దేశ అభివృద్ధికి ఆటంకాలని తెలిపారు. డిజిటల్ చెల్లింపులు చేయండి.. దేశానికి సేవ చేయండి అని పిలుపునిచ్చారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా దేశవ్యాప్తంగా పెద్దమొత్తంలో నల్లధనం తగ్గిందని.. ఇది నవభారతానికి భారీ ముందడుగు అని చెప్పారు. నల్లధనంపై పోరాటాన్ని తర్వాతి స్థాయిలోకి తీసుకెళ్దామని తెలిపారు. ఇందుకు ప్రతి భారతీయుడు ప్రతిజ్ఞ చేయాలని సూచించారు. పాఠశాల ఫీజులు, ఔషధాలు, ఇంటి సరుకులు, రైలు టికెట్ ఇలా ప్రతి కొనుగోలును డిజిటల్‌తోనే చేయండి. దీనిని దైనందిన జీవనంలో భాగం చేసుకుంటే.. దేశంలో మీరు ఊహించనంతంటి మార్పులు జరుగుతాయి.

నవభారత నిర్మాణంలో మీరూ భాగం పంచుకోండి అని కోరారు. ఈ ఏడాది రూ.2500 కోట్లు డిజిటల్ చెల్లింపులు జరుగుతాయని బడ్జెట్ అంచనా వేసిందని.. 125 కోట్ల భారతీయులు తలుచుకుంటే దీనికి ఏడాది అవసరం లేదని, ఆరు నెలలు చాలని అన్నారు. డిజిధన్ కార్యక్రమానికి పెద్దఎత్తున స్పందిస్తున్న ప్రజలందరికీ ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. కేంద్రప్రభుత్వం రూపొందించిన డిజిటల్ చెల్లింపుల మొబైల్ యాప్ భీమ్‌ను ఇప్పటికే 50 లక్షలమంది డౌన్‌లోడ్ చేసుకున్నారని తెలిపారు. స్వచ్ఛభారత్‌ను కొనసాగించాలని పిలుపునిచ్చిన ప్రధాని.. బంగ్లాదేశ్ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. రవీంద్రనాథ్ ఠాగూర్ బంగ్లాదేశ్, భారత్ జాతీయగీతాల రచయిత కావడం గర్వకారణమని పేర్కొన్నారు. భరతమాత దాస్యశృంఖలాలను తెంచేందుకు చిన్నవయస్సులోనే అమరుడైన భగత్‌సింగ్ ఎల్లప్పుడూ స్మరణీయుడని కొనియాడారు. బ్రిటీష్ పాలనను వ్యతిరేకంగా మహాత్ముడు సాగించిన సత్యాగ్రహాన్ని ఇప్పుడు దేశంనుంచి పేదరికం, నిరక్షరాస్యతను తరిమేందుకు కొనసాగించాలని పిలుపునిచ్చారు. గతంలో మాతృత్వ సెలవు 12 వారాలు ఉండగా ఇప్పుడు 26 వారాలకు పెంచామని.. కేంద్రం తీసుకున్న నిర్ణయాల్లో అతి ముఖ్యమైనదని తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*